విజయ్ ఆంటోనీ ఈసారి దర్శకత్వ బాధ్యతను తలకెత్తుకుని చెల్లి ఎమోషన్ తో ఓ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. 


 2016 లో విజయ్ ఆంటోనీ హీరోగా సత్నా టైటస్ హీరోయిన్ గా.. దర్శకుడు శశి తెరకెక్కించిన చిత్రం ‘బిచ్చగాడు’. గతంలో వెంకటేష్ తో ‘శీను’ వంటి చిత్రాన్ని కూడా తెరకెక్కించాడు ఈ దర్శకుడు. ఇక అప్పటి వరకూ సంగీత దర్శకుడిగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ ఈ చిత్రంలో నటించడమే కాకుండా.. స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం కూడా విశేషం. మొదట ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు పట్టించుకోలేదు. కానీ రెండో వారం నుండీ ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించి 100 రోజులు ఆడింది. తెలుగులో చాలా కాలం తరువాత 100 రోజులు ఆడిన తమిళ సినిమాగా రికార్డులు సృష్టించింది. 

అయితే ఆ తర్వాత విజయ్ ఆంటోనికి ఒక్క హిట్టూ పడలేదు. వచ్చిన సినిమాలు వచ్చినట్లే వెళ్లిపోతున్నాయి. ఈ నేపధ్యంలో మళ్లీ ‘బిచ్చగాడు’నే నమ్ముకుని ‘బిచ్చగాడు-2’అంటూ సినిమా తీసి వదిలాడు. ఈ సినిమాకు విజయ్ ఆంటోని డైరక్టర్,నిర్మాత, హీరో కూడా. నిన్న శుక్రవారం రోజు ఈ చిత్రం గ్రాండ్ గా తెలుగు మరియు తమిళం లలో విడుదలైంది. రివ్యూలతో యావరేజి టాక్ ని తెచ్చుకున్నా ఓపెనింగ్స్ విషయం లో దుమ్ము లేపేసింది . ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం లో చాలా చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ వస్తున్నాయి. ‘దసరా’ మరియు ‘విరూపాక్ష’తరహాలో ఈ సమ్మర్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని లెక్కలేస్తున్నారు.

ట్రేడ్ నుంచి అందుతున్న రిపోర్ట్ ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు కేవలం తెలుగు రాష్ట్రాల నుండే రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ అవ్వాలంటే 6 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలంటున్నారు. ఈ వీకెండ్ లో ఈ సినిమా ఇదే విధంగా స్టడీ కలెక్షన్స్ ని మైంటైన్ చేస్తే బ్రేక్ ఈవెన్ చాలా తేలికగా అయిపోతుందని అంటున్నారు. బి,సి సెంటర్లలలో ఈసినిమా బాగా వర్కవు్ట అవుతోంది.