Asianet News TeluguAsianet News Telugu

"అదిరింది" మూవీ రివ్యూ రేటింగ్

  • చిత్రం : అదిరింది
  • నటీనటులు : విజయ్, సమంత, కాజల్, నిత్యామీనన్, ఎస్.జె.సూర్య, సత్యరాజ్, వడివేలు తదితరులు
  • సంగీతం : ఏఆర్‌ రెహమాన్‌
  • దర్శకత్వం : అట్లీ కుమార్
  • నిర్మాణం : శ్రీ తేండాల్‌ ఫిలింస్‌
  • ఆసియానెట్ రేటింగ్ : 3/5
vijay adirindi movie review

తమిళ దలపతి విజయ్ నటించిన ‘మెర్సల్’ సినిమా తమిళంలో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. విజయ్‌కి తెలుగులో పెద్దగా మార్కెట్ లేకపోయినా ‘మెర్సల్’ వివాదంతో దాని తెలుగు అనువాదం ‘అదిరింది’పై ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. అయితే విడుదల వాయిదా పడుతూ వస్తూ ఎట్టకేలకు ‘అదిరింది’ గురువారం (నవంబర్ 9న) తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం! 

కథ:
 
ఇది మెడికల్ మాఫియా చుట్టూ అల్లుకున్న కథ. సిటీలో వరసగా ఒక హాస్పిటల్ చెయిన్ కు సంబంధించిన వాళ్ళు కిడ్నాప్ అవుతుంటారు. ఆ తర్వాత హత్యకు గురవుతారు. అందరికి అంతర్జాతీయంగా పేరు తెచ్చుకుని ఐదు రూపాయలకే సేవ చేసే  డాక్టర్ గా పేరున్న భార్గవ్(విజయ్)మీద అనుమానం వస్తుంది. మరోవైపు మేజిక్ షోలు చేస్తూ ఉండే విజయ్(విజయ్)పాత్ర ఎంటర్ అవుతుంది. స్టేజి మీద అందరు చూస్తుండగానే ఒక హత్య చేసి పారిపోతాడు. అసలు భార్గవ్ కి, విజయ్ కి ఉన్న సంబంధం ఏంటి, ఒక మారుమూల గ్రామంలో విజయ్-భార్గవ్ ల బాల్యంలో హత్య చేయబడ్డ తండ్రి దళపతి(విజయ్)కు కనెక్షన్ ఏంటి  అనేది తెరమీద చూడాల్సిన బాలన్స్. ఈ ముగ్గురి జీవితంతో ఆడుకున్న డాక్టర్ డేనియల్(ఎస్ జె సూర్య)కూడా కథలో కీలక భాగం.


విశ్లేషణ: 
జీఎస్టీ, కార్పొరేట్ హాస్పిటళ్లు ఇలా సమాజాన్ని ఇబ్బంది పెడుతున్న అంశాలను ప్రధాన అంశంగా తీసుకొని దర్శకుడు అల్లుకున్న కమర్షియల్ కథ ఆడియన్స్‌ను మెప్పిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే తమిళంలో వివాదాలకు కారణమైన జీఎస్టీకి సంబంధించిన డైలాగులను తెలుగు వెర్షన్‌లో మ్యూట్ చేయడం ప్రేక్షకులను నిరాశపరుస్తుంది. సినిమా ఒక ఫ్లోలో వెళ్తునప్పుడు ఇలా డైలాగ్స్‌ను వినిపించకుండా చేశారు. సినిమాలో ఒక్క సన్నివేశం కూడా అభ్యంతరకరంగా అనిపించలేదు. సమాజంలో ఏదైతే జరుగుతుందో.. దానినే తెరపై చూపే ప్రయత్నం చేశారు.

‘ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి జబ్బు చేసిందని పొరపాటున కార్పొరేట్ హాస్పిటల్‌కు వెళ్తే.. ఆ టెస్ట్, ఈ టెస్ట్ అంటూ అక్కర్లేని పరీక్షలన్నీ చేసి చివరికి వారి గుండె బరువెక్కేంత బిల్లును చేతిలో పెడతారు. కొన్ని హాస్పిటల్స్‌లో సాధారణ ప్రసవాలకు బదులు కావాలని సిజరిన్లు చేస్తున్నారు. పేదవాడికి సకాలంలో వైద్యం అందే పరిస్థితి మన దేశంలో కనిపించడంలేదు. దీనంతటికీ కారణం మన నేతల పరిపాలనే..’ ఈ అంశాలన్నింటినీ ప్రస్తావిస్తూ, ప్రశ్నిస్తూ దర్శకుడు అట్లీ రాసుకున్న కథ ప్రశంసనీయం.

 

నటీనటులు :
మూడు విభిన్న పాత్రల్లో కనిపించిన విజయ్‌, ప్రతీ పాత్రలోనూ వేరియేషన్‌ చూపిస్తూ ఆకట్టుకున్నాడు. స్టైల్‌, యాక్షన్‌ తో మాస్‌ ఆడియన్స్‌ను అలరించటంలో తనకు తిరుగులేదని  మరోసారి ప్రూవ్‌ చేసుకున్నాడు. ముఖ్యంగా ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ లో వచ్చే సన్నివేశాల్లో విజయ్‌ నటన కంటతడి పెటిస్తుంది. హీరోయిన్లుగా కాజల్‌, సమంత నిత్యామీనన్‌లు కనిపించినా.. చెప్పుకోదగ్గ పాత్ర దక్కింది మాత్రం ఒక్క నిత్యామీనన్‌కే. ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌లో వచ్చే నిత్యా పాత్ర సినిమాకు మేజర్‌ ప్లస్‌ పాయింట్స్‌లో ఒకటి. విలన్‌ ఎస్‌జే సూర్య సూపర్బ్‌ అనిపించాడు. తన బిజినెస్‌ కోసం ఎలాంటి అన్యాయమైనే చేసే క్రూరుడిగా అద్భుతంగా నటించాడు. ఇతర పాత్రల్లో సత్యరాజ్‌, వడివేలు, కోవే సరళ తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

సాంకేతిక నిపుణులు :

కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. రెహ్మాన్ అందించిన పాటలు మెప్పిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత ఆకట్టుకుంటుంది. అయితే సినిమాలో పాటలు ఎక్కువయ్యాయనే భావన కలుగుతుంది. సినిమా నిడివి కూడా చాలా ఎక్కువగా ఉంది. చాలా కాలంగా విజయ్ తెలుగులో మంచి సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమాతో అతడి కోరిక తీరిందనే చెప్పాలి. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకుడికి ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

ప్లస్ పాయింట్స్ :
విజయ్‌ నటన
కథ
బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌

మైనస్ పాయింట్స్ :
సెకండ్‌ హాఫ్‌లో కొన్ని సీన్స్‌
పాటలు
నేటివిటీ

చివరగా :

మంచి సినిమా చూశామన్న అనుభూతిని మిగిల్చే “అదిరింది”

 

Follow Us:
Download App:
  • android
  • ios