ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి పలు విషయాలు బయటకి వస్తోన్న సంగతి తెలిసిందే. కొందరు నటీమణులు తాము ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ అనుభవాలను బయటపెట్టారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని అంటోంది.

బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బిజీగా ఉన్న విద్యాబాలన్ తాను ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వెల్లడించింది. ఒక దర్శకుడు తనను రూమ్ కి రమ్మంటూ పిలిచాడని విద్యాబాలన్ చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ఒక సినిమా కాన్సెప్ట్ చెప్పడానికి ఒక దర్శకుడు తన దగ్గరకు వచ్చాడని.. కథను వివరించడానికి సమయం కోరాడని చెప్పింది.

తను అందుకు ఓకే చెప్పి.. కాఫీ షాప్ లో కలుద్దామని చెప్పగా ఆ దర్శకుడు మాత్రం తన రూమ్ కు రావాలని కోరడాని విద్యాబాలన్ వెల్లడించింది. రూమ్ కి ఎందుకు..? కాఫీ షాప్ లో కలుద్దామని తను చాలా సార్లు చెప్పినా.. అతడు మాత్రం రూమ్ కే రమ్మంటూ వెకిలిగా మాట్లాడాడంటూ చెప్పుకొచ్చింది.

అతడి ఉద్దేశాన్ని అర్ధం చేసుకొని తలుపు తెరిచి బయటకి వెళ్లమన్నట్లుగా చూడగా.. ఐదు నిమిషాలు ఎగాదిగా చూసి బయటకి వెళ్లిపోయాడని చెప్పింది. చెన్నైలో తనకు ఈ అనుభవం ఎదురైందని విద్యా చెప్పింది. అయితే ఆ దర్శకుడు ఎవరనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.