భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం పై మూవీ తెరకెక్కనుందా అంటే ఇందిరా బయోపిక్ కు ప్లాన్ చేస్తున్నారనే సమాధానం వస్తోంది. ప్రముఖ జర్నలిస్ట్ సాగరికా ఘోష్ రాసిన ‘ఇందిరా: ఇండియాస్ మోస్ట్ పవర్‌ఫుల్ పీఎం' బయోగ్రఫీ హక్కుల్ని కూడా విద్యా కొనుగోలు చేసింది. సినిమా లేదా వెబ్ సిరీస్ రూపంలో ఇందిరా గాంధీ జీవితాన్ని తెరకెక్కించాలని విద్యా బాలన్ యోచిస్తోందట.

 

అయితే ఇందిరాగాంధీ‌గా విద్యా బాలన్ నటించడం సహించరాని విషయమని.. ‘లక్ష్మీస్ వీరగ్రంధం' చిత్ర తెరకెక్కిస్తున్నానన్న దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఒక గొప్ప మహిళా నాయకురాలి పాత్ర ను డర్టీ పిక్చర్ లాంటి చిత్రంలో నటించిన లేడీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇందిరా గాంధీ పాత్రలో విద్యా బాలన్ నటించబోతున్నారనే వార్త ఇందిర అభిమానులను కలతకు గురి చేస్తుందని, వెంటనే ఆమె ఆ ప్రయత్నం‌ను విరమించాలని కేతిరెడ్డి కోరారు.

 

ఈ దేశ సమైక్యత, సమర్గతలను కాపాడే ప్రయత్నంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఒక మహిళా నేత పాత్రలో విద్యా బాలన్ లాంటి నటిని ఊహించటం కష్టమని, ఆమె ఆ ప్రయత్నం మానుకోక పోతే ఇందిర అభిమానుల ఆగ్రహానికి గురికాక తప్పదని కేతిరెడ్డి హెచ్చరించారు.

 

కళాకారులు ఏ పాత్ర, ఎవరైనా పోషించవచ్చు. కానీ వారు గతంలో నటించిన పాత్రల ప్రభావం ఈ పాత్రపై ఉంటుంది కాబట్టి అభిమానులు, ప్రజలు జీర్ణించుకోలేని పరిస్థితి ఉంటుందని,కొందరు కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని, అప్పుడు కోర్టుల చుట్టూ తీరిగే కంటే ముందు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. నరేంద్రమోడీ పాత్రలో శక్తికపూర్ నటిస్తే ప్రజలు ఒప్పుకుంటారా.. అని కేతిరెడ్డి ప్రశ్నించారు.