సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా వివాదాలను సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని కొందరు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కానీ వర్మ మాత్రం అనుకున్న సమయానికి సినిమా వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

అయితే ఈ సినిమాలో కీలకంగా చెప్పుకునే వైశ్రాయ్ హోటల్ ఎపిసోడ్ కి సంబంధించి ఆరు నిమిషాల నిడివి గల వీడియో ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది. అందులో ఎన్టీఆర్.. లక్ష్మీపార్వతితో కలిసి వైశ్రాయ్ హోటల్ వద్దకు చైతన్య రథం మీద తన అనుచరులను వెంటేసుకొని వస్తారు.

అయితే ముఖ్యమంత్రి అయినా.. ప్రైవేట్ వ్యక్తులకు ఇందులో అనుమతి లేదని సెక్యురిటీ చెప్పడంతో మొదలవుతుంది. బయట నుండి మైకులో ఎన్టీఆర్  బిగ్గరగా తన వాళ్లను అభ్యర్ధించడం చంద్రబాబుని పోలిన పాత్ర లోపల ఎవరితోనో చెవిలో ఏదో చెప్పడం.. వెంటనే ఎన్టీఆర్ మీద చెప్పుల వర్షం కురవడం ఇదంతా క్లియర్ గా చూపించారు.

ఎన్టీఆర్ అక్కడికక్కడే కుప్పకూలి బాధ పడుతుండగా.. బ్యాక్ గ్రౌండ్ లో 'దగా దగా' అనే పాట మొదలవుతుంది. అయితే ఇప్పుడు వీడియోను ఆన్ లైన్ లో నుండే తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల వీడియోను డిలీట్ చేశారు.