తెలుగు సినీ రంగంలో 1970లో వెలుగు వెలిగి స్టార్ గా మారిన ప్రముఖ నటి విజయభాను ఇటీవల మరణించారు. ఆమె వయసు 68 సంవత్సరాలు.

నాట్యకారిణిగా, పాన్ ఇండియా నటిగా పేరు పొందిన నటి విజయభాను. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు విజయభాను. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఆమె సడెన్ గా మృతిచెందడం అందరిని షాక్ కు గురిచేసింది.

అనంతపురం టు అమెరికా విజయభాను ప్రస్థానం

అనంతపురంకు చెందిన విజయభాను చెన్నైలో పుట్టి, పెరిగి, నటనలో పట్టు సాధించారు. కెరీర్ పీక్ లో ఉండగానే ఓ అమెరికన్‌తో ప్రేమలో పడిన ఆమె, అతన్ని పెళ్లాడి అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో స్థిరపడ్డారు. అక్కడే శ్రీ శక్తి శారదా నృత్యనికేతన్ అనే నాట్యకళాశాల స్థాపించి వేలాది మంది విద్యార్థులకు భారతీయ నాట్యరూపాల్లో శిక్షణ ఇచ్చారు. భరతనాట్యం, కూచిపూడి, కథక్, కథకళి లాంటి క్లాసికల్ డాన్స్ లలో తిరుగులేని ఇమేజ్ సాధించిన విజయభాను.. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇచ్చారు.

నాట్యమయూరి విజయభాను

తెలుగుతో పాటు అన్ని భాషల్లో దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించిన విజయభాను. రాజబాబు జోడీగా ఎక్కువ సినిమాల్లో కనిపించారు. వీరిద్దరిది హిట్ కాంబో కావంతో ఎక్కువగా వీరిని తీసుకోవాలని ప్రయత్నాలు చేసేవారు. ఇక చిరంజీవి, కమల్ హాసన్, జయసుధలతో కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ఇది కథ కాదు సినిమాలో విజయభాను పోషించిన పాత్రకు ఉత్తమ సహాయనటిగా నంది అవార్డు లభించింది. ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి చేతుల మీదుగా నాట్యమయూరి బిరుదును కూడా అందుకున్నారు విజయభాను.

అమెరికా నుంచి వచ్చి తిరిగిరాని లోకాలకు

తన మాతృమూర్తి కట్టించిన శివ నారాయణ పంచముఖ ఆంజనేయ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారు విజయభాను. సేవ చేయడం అంటే ఎంతో ఇష్టపడే ఆమె.. సహాయంకోసం ఇంటికి వచ్చిన ఎవరిని ఉత్త చేతులతో పంపించరు. తమ సహాయం కోరిన వందలాది మందికి అండగా నిలిచారు.

ఇక అమెరికాలోనే ఉంటున్న ఆమె గత నెలలో ఇండియాకు వచ్చారు. చెన్నైలోని తన ఇంటిని చూడటానికి వెళ్లి ఎండ వేడి తట్టుకోలేకపోయారు. వేడి కారణంగా వడదెబ్బ తగిలి విజయభాను మరణించారు. విజయభానుకు ఒకే ఒక కుమార్తే. ఆమె అమెరికాలో ఓ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

విజయభానును నిలబెట్టిన సినిమాలు

విజయభాను తెలుగు, తమిళంలో ఎక్కువ సినిమాలు చేశారు. ఎన్టీఆర్, ఎమ్జీఆర్, ఏఎన్నార్ లాంటి స్టార్స్ సినిమాలో మంచి మంచి పాత్రల్లో కనిపించారు. ఆమె నటించిన సినిమాలు కొన్ని నిప్పులాంటి మనిషి, ఇది కథ కాదు, కిలాడి బుల్లోడు, ఒక నారి వంద తుపాకులు, చందన, ప్రియబాంధవి, స్త్రీ , శభాష్ పాపన్న, చిన్నికృష్ణుడు వంటి ఎన్నో సినిమాల్లో విజయభాను చేసిన పాత్రలు నటిగా ఆమెను నిలబెట్టాయి.