తమిళ చిత్రాల్లో ఎన్నో పాత్రలు పోషించిన సీనియర్ నటి ఇప్పుడు మెరీనా బీచ్ లో కర్చీఫ్ లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. ఆ నటి దీన పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు 500 కి పైగా సినిమాల్లో నటించిన రంగమ్మాల్ వయసు 83.

గత కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోవడంతో ఆమె చెన్నై బీచ్ లో కర్చీఫ్ లతో పాటు మరికొన్ని వస్తువులను అమ్ముకుంటూ బ్రతుకుతోంది. హాస్య నటుడు వడివేలుతో కలిసి ఆమె ఎన్నో సినిమాల్లో నటించారు.

ఆమెను గుర్తించిన కొందరు సినీ అభిమానులు తోచినంత సహాయం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకు కలిగిందని ఆమెను ప్రశ్నించగా.. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో పిల్లల్ని చదివించానని కానీ వారు ఇప్పుడు పట్టించుకోవడం లేదని వాపోయింది.

బతుకుతెరువు కోసం ఇలా జీవనం సాగిస్తున్నాని.. ప్రభుత్వం లేదా నడిగర్ సంఘం తన పరిస్థితిని గ్రహించి ఆదుకోవాలని కోరుకుంది. ఈ విషయం నడిగర్ సంఘం వరకు వెళ్లడంతో ఆమెకి నెలకు రూ.5 వేల చొప్పున సహాయం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.