కెనడాలో ఉంటోన్న ప్రముఖ బాలీవుడ్ సినీ నటుడు ఖాదర్ ఖాన్(81) నిన్న సాయంత్రం హాస్పిటల్ లో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు సర్ఫరాజ్ అధికారికంగా వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం ఆయన అస్వస్థతకి గురి కావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో జాయిన్ చేశారు. 

డాక్టర్లు వెంటిలేటర్ పై పెట్టి ఆయనకు చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ముందే చెప్పారు. దీర్ఘకాలంగా ఆయన న్యుమోనియాతో బాధపడుతూ డిసంబర్ 31న కన్నుమూశారు. 81 ఏళ్ల వయసు గల ఆయన శరీరం ట్రీట్మెంట్ కి సరిగ్గా రెస్పాండ్ కాలేదని సమాచారం.

ఈ విషయంపై ఆయన కుమారుడు మాట్లాడుతూ.. ''మా నాన్నగారు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. డిసంబర్ 31న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఆయన మరణించారు. సోమవారం మధ్యాహ్నం ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. గత 16 ,17 వారాలుగా ఆయన హాస్పిటల్ లోనే ఉన్నారు. అంత్యక్రియలు కెనడాలోనే జరపనున్నాం'' అంటూ వెల్లడించారు.

నటుడిగా, రైటర్ ఖాదర్ ఖాన్ ఎన్నో సినిమాలకు పని చేశాడు. 1980, 90 లలో ఆయన సినీ పరిశ్రమకు ఎన్నో సేవలనందించారు. కాబుల్ లో జన్మించిన ఆయన 1973లో 'దాగ్' అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. దాదాపు మూడు వందల సినిమాల్లో ఆయన నటించారు.

దాదాపు 250 సినిమాలకు రైటర్ గా పని చేశారు. నటుడిగా మారక ముందు రణధీర్-జయాబచ్చన్ నటించిన 'జవానీ దివానీ' సినిమాకు డైలాగ్ రైటర్ గా పని చేశారు. హిందీలో ఆయన 'ముజ్ సే షాదీ కరోగీ', 'లక్కీ', 'జోరూ కా గులాం' ఇలాంటి ఎన్నో చిత్రాల్లో నటించారు.