చిత్ర పరిశ్రమలో విషాదం... అమెరికాలో కన్నుమూసిన టాలీవుడ్ సీనియర్ నటుడు!
చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు ఈశ్వరరావు హఠాన్మరణం పొందారు. అమెరికా వెళ్లిన ఆయన కూతురి ఇంటి వద్ద తుది శ్వాస విడిచారు.

సీనియర్ నటుడు ఈశ్వరరావు మరణవార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈశ్వరరావు అక్టోబర్ 31న అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో కన్నుమూశాడు. ఆయన కుమార్తె మిచిగాన్ లో నివసిస్తున్నారు. కూతురు వద్దకు వెళ్లిన ఈశ్వరరావు అక్కడే మరణించారు. ఈశ్వరరావు మృతిని కుటుంబ సభ్యులు ధ్రువీకరించినట్లు సమాచారం. ఈశ్వరరావు మరణవార్త తెలుసుకున్న చిత్ర ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఈశ్వరరావును దర్శకుడు దాసరి నారాయణరావు వెండితెరకు పరిచయం చేశాడు. ఆయన మొదటి చిత్రం స్వర్గం నరకం. దాసరి నారాయణరావు, మోహన్ బాబు ప్రధాన పాత్రలు చేయగా ఓ కీలక పాత్రలో ఈశ్వరరావు నటించారు. స్వర్గం నరకం విజయం సాధించింది. దాంతో ఆయన పరిశ్రమలో బిజీ అయ్యారు. స్వర్గం నరకం చిత్రానికి ఆయన నంది అవార్డు అందుకున్నారు.
కెరీర్లో 200లకు పైగా చిత్రాల్లో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలక్షణ పాత్రలు చేశారు. యుగపురుషుడు, ప్రేమాభిషేకం, బంగారు బాట, ఘరానా మొగుడు వంటి హిట్ చిత్రాల్లో ఆయన నటించారు, ఈశ్వరరావు మృతి వార్త తెలుసుకున్న అభిమానులు, చిత్ర ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.