ఓ ముక్కూ మొహం తెలియని హీరో సినిమాకు కూడా కనీస ఓపెనింగ్స్ ఉంటాయి. సినిమాపై ఏమాత్రం ఆసక్తి లేకున్నా.. వీకెండ్ లో ఓ లుక్ వేద్దాంలే అని థియేటర్స్ కి వెళ్లే ప్రేక్షకులు ఉంటారు. అలాంటిది ఒకప్పటి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan babu) చిత్రం సన్ ఆఫ్ ఇండియా పరిస్థితి చూస్తే జాలేస్తుంది.
సన్ ఆఫ్ ఇండియా(Son of India) చిత్రాన్ని పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. అసలు లోపం ఎక్కడ ఉంది. మోహన్ బాబులోనా? లేక ప్రేక్షకులలోనా? ఆయన ఎంచుకున్న సినిమాల్లోనా?. ఫిబ్రవరి 18న సన్ ఆఫ్ ఇండియా విడుదల అవుతుంది. బుక్ మై షోలో ఈ చిత్ర అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. సన్ ఆఫ్ ఇండియా భారీ ఓపెనింగ్స్ మొదటిరోజు రూ. 500 గ్రాస్ వసూళ్లు. ఇది సోషల్ మీడియాలో నెటిజెన్స్ ప్రచారం. సన్ ఆఫ్ ఇండియా చిత్ర ఓపెనింగ్స్ పై మంచు ఫ్యామిలీ వ్యతిరేకుల ప్రచారం. సోషల్ మీడియాలో ఈ పోస్ట్స్ పెడుతుంది మోహన్ బాబు యాంటీ ఫ్యాన్స్ అయినప్పటికీ... వారి ప్రచారం మాత్రం నిజమే. సన్ ఆఫ్ ఇండియా ప్రదర్శితం అవుతున్న ప్రతి థియేటర్ లో కనీసం 10-20 శాతం టికెట్స్ అమ్ముడు పోలేదు.
హైదరాబాద్ నగర మొత్తం మీద 50 థియేటర్స్ కి లోపే సన్ ఆఫ్ ఇండియా విడుదల అవుతుంది. ఒక్క థియేటర్ లో కూడా కనీసం సగం టికెట్స్ అమ్ముడుపోలేదు. ఇదేదో విడుదలైన రెండో మూడో రోజో కూడా కాదు. మొదటిరోజే... అసలు సినిమా టాక్ బయటకు రాకుండానే సన్ ఆఫ్ ఇండియా కథ ముగిసింది. చాలా థియేటర్స్ లో రిలీజ్ రోజే షో క్యాన్సిల్ కావచ్చు. ఎందుకంటే ఒకరిద్దరు ప్రేక్షకుల కోసం షో వేయరు కాబట్టి. హైదరాబాద్ లో పేరున్న ప్రసాద్స్ మల్టీ ఫ్లెక్స్ లో కూడా మార్నింగ్ షోకి సగం టికెట్స్ కూడా అమ్మడు పోలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అసలు మోహన్ బాబుకు ఇంకా సోలో సినిమాలు అవసరమా చెప్పండి. రెండు దశాబ్దాల క్రితమే ఆయన ఫేడవుట్ అయ్యారు. 1999లో విడుదలైన యమజాతకుడు చిత్రంతో ఆయన సోలో హీరోగా హిట్ కొట్టినట్టు గుర్తు. ఈ ఇరవైఏళ్ళ కాలంలో హిట్ మరలా ఆయన్ని పలకరించలేదు. ఈ క్రమంలో అనేక ప్రయోగాలు చేశారు. సినిమానే నమ్ముకున్నవాడిగా వాస్తవం తెలిసొస్తున్నా ప్రయత్నం ఆపలేదు. అయితే సబ్జెక్టు ఏదైనా ఆయనకు ప్లాప్ కామనైపోయింది.
అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు, మేజర్ చంద్రకాంత్ వంటి చిత్రాలతో కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు సినిమాకు ప్రస్తుతం కలెక్షన్స్ నిల్. దానికి తోడు వ్యతిరేకుల నుండి సెటైర్స్, ట్రోల్స్, అవమానాలు. ఎంత పెద్ద స్టార్ అయినా ఇలాంటి దశ ఎదుర్కోవాల్సిందే. అవుట్ డేటెడ్ అయ్యాక ఎవరూ పట్టించుకోరు. రజినీకాంత్ లాంటి స్టార్ సినిమాలనే జనాలు తెలుగులో చూడటం మానేశారు. ఆయనతో పోల్చుకుంటే మోహన్ బాబు పరిస్థితి మనకు పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విజయాలు అందుకుంటున్న మోహన్ బాబు... సెకండ్ ఇన్నింగ్స్ అలా సక్సెస్ ఫుల్ గా ముగిస్తే బెటర్.
