తెలుగు సాహితీవేత్త వెన్నెలకంటి మరణం చిత్ర పరిశ్రమను శోకసముద్రంలో ముంచివేసింది. 62ఏళ్ల వెన్నెలకంటి గుండెపోటు కారణంగా కన్నుమూయగా... సినీ ప్రముఖులు ఆయనతో గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కాగా విశ్వనటుడు కమల్ హాసన్ తో వెన్నెల కంటికి ప్రత్యేక అనుబంధం ఉండేది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా భారీ మార్కెట్ కలిగిన కమల్ హాసన్ ప్రతి సినిమా తెలుగులో డబ్ అయ్యేది. 
కమల్ హాసన్ నటించిన అనేక తెలుగు డబ్ వర్షన్ చిత్రాలకు వెన్నెలకంటి మాటలు అందించారు. 

2002లో వచ్చిన కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ పంచతంత్రం మూవీకి మొదటిసారి మాటల రచయితగా పనిచేశారు వెన్నెలకంటి. ఆ సినిమాకు వెన్నెలకంటి ఇచ్చిన డైలాగ్స్ నచ్చడంతో కమల్ హాసన్ నటించిన పలు చిత్రాలకు మాటల రచయితగా పనిచేశారు. 

కమల్ కెరీర్ లో మైలు రాయిగా నిలిచినా దశావతారం మూవీకి మాటలు అందించింది వెన్నెలకంటి కావడం విశేషం. అలాగే 2004లో విడుదలైన పోతురాజు, 2005లో వచ్చిన ముంబై ఎక్స్ ప్రెస్ లతో పాటు మాధవన్, కమల్ హాసన్ కలిసి నటించిన మన్మధ బాణం చిత్రాలకు వెన్నెలకంటి మాటలు అందించారు. తమిళ్ డబ్బింగ్ సినిమాల పాటలకు సాహిత్యం అందించడంలో వెన్నెలకంటి దిట్ట అని చెప్పాలి.