చాలా కాలంగా సరైన హిట్టు సినిమా పడక నిరాశలో ఉన్న విక్టరీ వెంకటేష్ కి 'ఎఫ్ 2' సినిమా మంచి ఊరటనిచ్చింది. ఈ సినిమాలో ఎంతమంది నటీనటులు ఉన్నా.. సక్సెస్ క్రెడిట్ మొత్తం వెంకీ ఖాతాలోకి వెళ్లిపోయింది. 

వెంకటేష్ కామెడీ టైమింగ్, విసిగిపోయిన భర్త క్యారెక్టర్ లో అతడి నటన చూసిన ప్రేక్షకులు సినిమాను హిట్ చేసేశారు. వెంకీ కామెడీ సినిమాకు కోట్లు తెచ్చిపెట్టింది. సీరియస్ రోల్స్ చేయడం మొదలుపెట్టిన తరువాత వెంకీ మార్కెట్ బాగా తగ్గిపోయింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' సినిమా సక్సెస్ క్రెడిట్ ఎక్కువ శాతం మహేష్ కి దక్కింది.

కానీ 'ఎఫ్ 2' సినిమా మాత్రం వెంకీ టాలెంట్ ఏంటో మరోసారి నిరూపించింది. వెంకటేష్ తదుపరి సినిమా కూడా మల్టీస్టారరే.. ఈసారి తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి సినిమా చేయబోతున్నాడు. 'వెంకీ మామ' అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. 'జై లవకుశ' ఫేం దర్శకుడు బాబీ రూపొందిస్తోన్న ఈ సినిమాను ఇటీవల మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు 'ఎఫ్ 2' సినిమాలో వెంకీ క్యారెక్టర్ చూసిన దర్శకుడు బాబీ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

వెంకీ పాత్రకి కామెడీ టచ్ ఇవ్వడంతో పాటు కొన్ని మ్యానరిజమ్స్ ను జోడిస్తున్నట్లు తెలుస్తోంది. కథ ప్రకారం వెంకీ క్యారెక్టర్ కాస్త డామినేట్ చేసే విధంగా డిజైన్ చేస్తున్నారు. 'ఎఫ్ 2 తరువాత వెంకీ నటిస్తోన్న సినిమా కాబట్టి కచ్చితంగా ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో మంచి డిమాండ్ ఉంటుంది.