మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సై రా నరసింహారెడ్డి' సినిమా గాంధీజయంతి సందర్భంగా అక్టోబర్ 2న రావడానికి సిద్ధమవుతోంది. అయితే 'సై రా' గనుక ఆ సమయానికి రాకపోతే ఆ డేట్ ని క్యాష్ చేసుకోవాలని చూశారు 'వెంకీ మామ' చిత్రనిర్మాతలు.

'సై రా' అనుకున్న టైంకి వచ్చినా కానీ అక్టోబర్ 8న సినిమాను విడుదల చేసి దసరా హాలిడేని క్యాష్ చేసుకోవాలనుకున్నారు. కానీ 'సై రా' టీజర్ రిలీజ్ అయిన తరువాత సినిమాని ఏ స్కేల్ లో రూపొందించారో అందరికీ అర్ధమైంది. దీంతో 'వెంకీ మామ' సినిమా దీపావళి వీకెండ్ కి వెళ్లిపోయిందని సమాచారం.

ఆ లెక్కన చూసుకుంటే అక్టోబర్ 25న 'వెంకీ మామ' సినిమాను రిలీజ్ చేస్తారన్నమాట. దీంతో 'సై రా' సినిమాకి, 'వెంకీ మామ' సినిమాల రిలీజ్ కి మధ్య మూడు వారాలకు పైగా గ్యాప్ ఉండనుంది. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తోన్న 'వెంకీ మామ' సినిమాలో తొలిసారిగా వెంకటేష్, నాగచైతన్య కలిసి నటిస్తున్నారు. రియల్ లైఫ్ లో మామా అల్లుల్లైన వీరు వెండితెరపై  ఎంత రచ్చ చేయబోతున్నారో చూడాలనే ఆసక్తి జనాల్లో నెలకొంది. 

పైగా ఇటీవల వెంకీ నటించిన 'ఎఫ్ 2' సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా పాయల్ రాజ్ పుత్, రాశిఖన్నాలు హీరోయిన్లుగా కనిపించనున్నారు.