పద్మావతి సినిమా విడుదలపై కొనసాగుతున్న ఆందోళనలు రాజ్ పుత్ ల బెదిరింపులను తప్పబట్టిన ఉప రాష్ట్రపతి వెంకయ్య ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్చను హరించే హక్కు ఎవరికీ లేదన్న వెంకయ్య
పద్మావతి సినిమాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగడం, చిత్ర నిర్మాత-దర్శకులు-హీరోయిన్‌కు బెదిరింపులు వచ్చిన నేపథ్యం...ఇది భావప్రకటన స్వేచ్ఛకు ప్రతిబంధకమే అనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తపరచడం వంటి పరిణామాల నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. భారత్‌లాంటి ప్రజాస్వామ్య దేశంలో హింసాత్మక ఆందోళనలు, బెదిరించే ప్రకటనలు ఏమాత్రం ఆమోద్యయోగ్యం కాదని వెంకయ్యనాయుడు తెలిపారు.
ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల సినిమాల్లో తమ మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ కొందరు ఆందోళనలకు దిగుతున్నారని ‘పద్మావతి’ నిరసనల గురించి పరోక్షంగా ప్రస్తావించారు. అయితే ఈ ఆందోళనలు కొన్ని సందర్భాల్లో అదుపు తప్పుతున్నాయని, ఇష్టమొచ్చినట్లు బెదిరింపు ప్రకటనలు, రివార్డులు ప్రకటిస్తున్నారని తెలిపారు. చట్టాలను తమ చేతిలోకి తీసుకొని ఇచ్చిమొచ్చినట్లు బెదిరింపు ప్రకటనలకు పాల్పడే హక్కు ఎవరికీ లేదని, అలాగే ఇతరుల మనోభావాలను కించపరిచే అధికారం కూడా ఎవరికీ లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ సందర్భంగా బెదిరింపుల రివార్డుల విషయాన్ని సైతం ఉపరాష్ట్రపతి ఎద్దేవా చేశారు.
సదరు బెదిరింపులను ప్రస్తావిస్తూ..‘రివార్డులు ప్రకటించేవారి దగ్గర అంత డబ్బు ఉందో లేదో.. నాకు మాత్రం అనుమానంగా ఉంది. ప్రతి ఒక్కరు రూ. కోటికి తగ్గకుండా రివార్డు ప్రకటిస్తున్నారు. రూ.కోటి అంటే చిన్న విషయమా. ఇలాంటి విషయాలను, ప్రకటనలను ప్రజాస్వామ్యం ఆమోదించదు’ అని వెంకయ్యనాయుడు తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయన్నది ముఖ్యం కాదని, పార్లమెంట్ ఎన్ని రోజులు పనిచేసిందన్నదని ముఖ్యమని వెంకయ్యనాయుడు తెలిపారు.
యుపి, ఎంపీ రాష్ట్రాలు పద్మావతి సినిమాను వ్యతిరేకిస్తుంటే... మరోవైపు పద్మావతి సినిమా విడుదలకు తాము ప్రత్యేక ఏర్పా ట్లు చేస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. చిత్ర బృందానికి తాము స్వాగతం పలుకుతామని అన్నారు. సినిమాను విడుదల కానివ్వకపోతే, మేం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. అందుకు బెంగాల్ ఎంతో గర్విస్తుంది అని ఇండియా టుడే సదస్సులో అన్నారు. దేశంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛను అడ్డుకొనేందుకు ప్రణాళిక ప్రకా రం కుట్ర జరుగుతున్నదని అన్నారు.
