ప్రతీ  సినిమా కథకీ ఏదో ఒక ప్రేరణ ఉంటుంది. అది ఓ ఆలోచన కావచ్చు...ఓ సినిమా కావచ్చు... మన పురాణ ఇతిహాసం కావచ్చు. అదే పద్దతిలో మామా, అల్లుడు అయిన వెంకటేష్, నాగచైతన్య కలిసి చేస్తున్న ‘వెంకీమామ’ సినిమా కథ కు కూడా ఓ ప్రేరణ ఉందని తెలుస్తోంది. భాగవతంలోని కంసుడు, చిన్ని కృష్ణుడు పాత్రల నేపధ్యాలను తీసుకుని ఈ కథను అల్లినట్లు సమాచారం. 

తన మేనల్లుడు చేతిలో తనకు మరణం ఉందని జాతకాలతో  పుట్టినప్పుడే తెలుసుకుని విడిపోయి...మళ్లీ పెద్దయ్యాక కలిసిన మామా-అల్లుడు కథ అని తెలుస్తోంది. జనార్దన మహర్షి చేసిన ఈ కథను కోన వెంకట్, దర్శకుడు బాబి కలిసి డవలప్ చేసారట. ఉగాది సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ లోగోను  విడుదల చేసింది చిత్రయూనిట్‌. రాశీ చక్రంలో.. వెంకీమామ టైటిల్‌ను ఆసక్తికరంగా డిజైన్‌చేశారు. లోగో లోని జాతకాలకు సంభందించిన రాశి చక్రం కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది. 

‘ఎఫ్‌2’తో ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చిన విక్టరీ వెంకటేష్‌..  ‘వెంకీమామ’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. నాగ చైతన్య, వెంకటేష్‌ కలిసి నటిస్తుండటంతో.. ఈ మూవీపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. చాలా కాలంపాటు వాయిదాపడుతూ వచ్చిన ఈ మూవీ.. ప్రస్తుతం జెట్‌స్పీడ్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది. సురేశ్‌ ప్రొడక్షన్స్, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేశ్‌ సరసన పాయల్‌ రాజ్‌పుత్, నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కేఎస్‌ రవీంద్ర (బాబి) దర్శకత్వం వహిస్తున్నారు.