కెరీర్ బిగినింగ్ నుండి రీమేక్ చిత్రాలకు వెంకటేష్ పెట్టింది పేరు. ఇతర భాషలలో విజయం సాధించిన హిట్ చిత్రాలను తెలుగులో రీమేక్ చేసి సూపర్ హిట్స్ కొట్టారు ఆయన. తాజాగా మరో సూపర్ హిట్ రీమేక్ కి వెంకటేష్ పచ్చ జెండా ఊపారు. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన మలయాళ చిత్రం దృశ్యం 2. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సస్పెన్సు థ్రిల్లర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దృశ్యం 2 చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు ధ్రువీకరించాయి. 

దృశ్యం 2 దర్శక నిర్మాతలు వెంకటేష్ ని కలవడం జరిగింది. ఓ సూపర్ హిట్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న నేపథ్యంలో అంచనాలు ఏర్పడ్డాయి . 2013లో విడుదలైన దృశ్యం సినిమాకు ఇది సీక్వెల్. మొదటి పార్ట్ లో కూడా మోహన్ లాల్, మీనా నటించడం జరిగింది. 2014లో దృశ్యం మూవీని వెంకటేష్ హీరోగా లేడీ డైరెక్టర్ తెరకెక్కించారు. అయితే ఈ దృశ్యం 2 ని మాత్రం మలయాళ వర్షన్ తెరకెక్కించిన జీతూ జోసెఫ్ తెరకెక్కించనున్నాడని సమాచారం. 

త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం అందుతుంది. ప్రస్తుతం వెంకటేష్ రెండు చిత్రాల షూటింగ్ లో పాల్గొంటున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎఫ్ 3తో పాటు, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న నారప్ప. నారప్ప తమిళ హిట్ మూవీ అసురన్ కి రీమేక్ కాగా, ఎఫ్ 3... 2019లో విడుదలైన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్. వరుస చిత్రాలు ప్రకటిస్తూ వెంకటేష్ కుర్ర హీరోలకు మించి దూసుకుపోతున్నారు.