2010లో విక్టరీ వెంకటేష్ హీరోగా నమో వెంకటేశాయ అనే సినిమా వచ్చింది. శీను వైట్ల దర్శకుడు. త్రిష హీరొయిన్ గా నటించిన ఆ మూవీ పర్వాలేదు అనేలా ఆడినా అందులో ఎంటర్ టైన్మెంట్ మాత్రం బాగుంటుంది. సినిమా ఇంట్రో లో బొమ్మ సహాయంతో మిమిక్రి చేసే ఆర్టిస్ట్ గా వెంకటేష్ ఒక రాజకీయ ప్రచార సభకు వెళ్తాడు. అక్కడ జీవాతో చేసే కామెడీ మామూలుగా ఉండదు. అతన్ని కామెడీ చేస్తూ పొగిడే స్క్రిప్ట్ బదులు తిడుతూ ఉండే వేరొక స్క్రిప్ట్ చదివి అక్కడి నుంచి తప్పించుకునే సీన్ భలే పేలింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా. అక్కడికే వస్తున్నాం. ఆ సినిమాలో వెంకటేష్ మాట్లాడడానికి వెళ్ళిన రాజకీయ పార్టీ బ్యానర్ లో జనసేన అని ఉంటుంది.మనం జనం కలిస్తే ప్రభంజనం- జనసేన పార్టీకి ఓటేద్దాం అని అందులో స్పష్టంగా చూడొచ్చు.

ఇది ఈ మధ్య టీవీలో వచ్చినప్పుడు చూస్తున్న ప్రేక్షకులు ఇది గమనించి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాకతాళీయంగా జరిగిందే తప్ప ముందే ప్లాన్ గా జరిగింది అని చెప్పడానికి లేదు. మరో ట్విస్ట్ ఏంటంటే వెంకటేష్ పవన్ కళ్యాణ్ లకు మంచి సాన్నిహిత్యం ఉంది. గోపాల గోపాలలో ఇద్దరు కలిసి యాక్ట్ చేస్తే పవన్ కోసం వెంకీ ప్రత్యేకంగా అజ్ఞాతవాసిలో క్యామియో చేసాడు. అలాంటిది పవన్ పార్టీ పేరు వెంకీ పాత సినిమాలో ఇలా కనిపించడం పట్ల ఇద్దరు ఫాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా జరగడం గతంలో కూడా ఉంది. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ పేరు మీద కృష్ణ - శ్రీదేవి జంటగా 1983లో ఒక సినిమా వచ్చింది. అదే సంవత్సరం చిరు ఖైది మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర చరిత్ర సృష్టించి ఆయన్ని స్టార్ హీరోని చేసింది. కృష్ణ సినిమా పేరుతోనే చిరంజీవి పార్టీ స్థాపించారు. ఇవన్ని అనుకోకుండా జరిగినవే తప్ప ఏదో ప్లాన్ ప్రకారం అనుకొని చేసినవి కాకపోయినా వినప్పుడు మాత్రం భలే ఆసక్తిగా ఉంటాయి