వెంకీ మామ `సైంధవ్‌` డిజాస్టర్‌ తర్వాత కాస్త ఆచితూచి సినిమాలు చేస్తున్నాడట. ఈ క్రమంలో ఇప్పుడు మరో క్రేజీ డైరెక్టర్‌కి ఓకే చేశాడని టాక్‌.  

విక్టరీ వెంకటేష్‌.. చూడబోతుంటే చాలా సెలక్టీవ్‌గా మూవీస్‌ చేస్తున్నట్టు ఉంది. ఇటీవల ఆయనకు వరుసగా పరాజయాలు వెంటాడటంతో కాస్త ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. చివరగా ఆయన `సైంధవ్‌` మూవీతో వచ్చాడు. కూతురు సెంటిమెంట్‌తో వచ్చిన యాక్షన్‌ మూవీ ఇది. బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. 

యాక్షన్‌ తేడా కొట్టడంతో ఎంటర్‌టైన్‌మెంట్‌ వైపు చూస్తున్నాడు. తనకు `ఎఫ్‌ 2`, `ఎఫ్‌3` వంటి వినోదాత్మక చిత్రాలను అందించిన అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ ఇటీవలే గ్రాండ్‌గా ప్రారంభమైంది. రెగ్యూలర్‌ షూటింగ్‌ కూడా షురూ అయినట్టు తెలుస్తుంది. ఇందులో ఐశ్వర్యా రాజేష్‌, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

ఇప్పుడు మరో క్రేజీ డైరెక్టర్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడనే వార్తలు ఊపందుకున్నాయి. `నీది నాది ఒకే కథ`, `విరాటపర్వం` చిత్రాలతో అదరగొట్టిన దర్శకుడు వేణు ఉడుగులతో ఓ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. వెంకీకి దర్శకుడు వేణు కథ చెప్పారని, ఆ పాయింట్‌ హీరోకి బాగా నచ్చిందని తెలుస్తుంది. దీంతో సినిమా చేసేందుకు ఆసక్తిని కనబరిచినట్టు సమాచారం. అన్ని కుదిరితే నెక్ట్స్ వెంకీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుందని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే వేణు ఉడుగుల చేసిన గత మూవీ `విరాటపర్వం`లో రానా హీరో అనే విషయం తెలిసిందే. సాయిపల్లవి కథానాయికగా నటించింది. ఇది నక్సల్‌ బ్యాక్ డ్రాప్‌లో రియలిస్టిక్‌ అంశాల ప్రధానంగా రూపొందించారు. విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ మూవీ కమర్షియల్‌గా సత్తా చాటలేకపోయింది. అనంతరం వేణు నాగచైతన్యతో ఓ ప్రాజెక్ట్ అనుకున్నారట. అది చర్చల దశలోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు వెంకీ సినిమా ఓకే అయ్యిందనే వార్తలు వినిపిస్తుంది. ఇది ఎంత వరకు నిజమనేది తెలియాల్సి ఉంది.