విక్టరీ వెంకటేష్ కు క్రికెట్ అంటే అమితమైన ఆసక్తి. ఇండియా ఆడే మ్యాచ్ లని వెంకీ స్టేడియంకు వెళ్లి చూసేందుకు ఇష్టపడుతుంటారు. సామాన్యుడిలాగే ఇండియా బాగా ఆడుతున్న సమయంలో కేరింతలు కొడుతుంటాడు. వెంకీ క్రికెట్ అంటే అంత పిచ్చి. ఇక సూపర్ స్టార్ మహేష్ కు కూడా క్రికెట్ అంటే ఇష్టమే. క్రికెట్ లో అతిపెద్ద పండుగ ప్రపంచ కప్ ఈ నెలలోనే ప్రారంభం కాబోతోంది. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ లోనే 2019 ప్రపంచకప్ జరగనుంది. 

ఈ నేపథ్యంలో వెంకటేష్, మహేష్ బాబు గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. సమయం దొరికినప్పుడల్లా వీరిద్దరూ విదేశాలకు టూర్ వెళ్లేందుకు, ఫ్యామిలీతో గడిపేందుకు ఆసక్తి చూపుతుంటారు. త్వరలో ప్రారంభం కాబోయే ప్రపంచ కప్ మ్యాచ్ లు చూసేందుకు వెంకటేష్, మహేష్ బాబు, మరికొందరు టాలీవుడ్ సెలెబ్రిటీలు ఇంగ్లాండ్ వెళ్ళబోతున్నారు. 

మహేష్ బాబు మహర్షి చిత్రాన్ని పూర్తి చేశాడు. తదుపరి చిత్రం ప్రారంభం కావడానికి ఇంకా సమయం ఉంది. వెంకటేష్ వెంకీ మామ చిత్రంలో నటిస్తున్నప్పటికీ ప్రపంచ  కప్ కోసం షూటింగ్ లో మార్పులు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇండియా ఆడే మ్యాచ్ లని వీలైనన్ని ఎక్కువ చూసేలా వీరిద్దరూ తమ టూర్ ప్లాన్ చేసుకుంటున్నారట. ఒక వేళ ఇండియా నాకౌట్ దశకు చేరుకుంటే వెంకీ, మహేష్ తమ టూర్ ని పొడిగించుకునే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సారి టీం ఇండియా బలంగా కనిపిస్తోంది. ప్రపంచ కప్ సాధించే సత్తా ఉన్న జట్టని అంచనాలు నెలకొని ఉన్నాయి. 

ఈ చిన్నోడు, పెద్దోడు ఇద్దరూ కలసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల మహేష్ మహర్షి ప్రీరిలీజ్ ఈవెంట్ కు కూడా వెంకీ అతిథిగా హాజరయ్యాడు.