మాస్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ గద్దలకొండ గణేష్ చిత్రాన్ని తెరకెక్కించారు. పూజా హెగ్డే హీరోయిన్ గా 20 నిమిషాల పాత్రలో నటించింది. తమిళ నటుడు అథర్వ, మృణాళిని కీలక పాత్రలో నటించారు. వరుణ్ తేజ్ మాస్ గెటప్ లో నటించిన తొలి చిత్రం ఇది. తమిళంలో ఘనవిజయం సాధించిన జిగర్తాండ చిత్రానికి కొన్ని మార్పులు చేసి హరీష్ ఈ చిత్రాన్ని రూపొందించారు. 

గద్దలకొండ గణేష్ చిత్రానికి వసూళ్లు అద్భుతంగా వస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండడంతో చిత్రయూనిట్ తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ... గద్దలకొండ గణేష్ చిత్రం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు. గద్దలకొండ గణేష్ లో హీరో నితిన్ చిన్న కామియో రోల్ చేశాడు. 

సాధారణంగా హీరోపైన జోక్ వేసే సన్నివేశంలో నటించేందుకు ఎవ్వరూ ఒప్పుకోరు. తాను అడిగిన వెంటనే నితిన్ ఆ రోల్ లో నటించారు. అందుకు నితిన్ కు థాంక్స్. హరీష్ శంకర్ గారు కళ్యాణ్ బాబాయ్ తో గబ్బర్ సింగ్ లాంటి చిత్రాన్ని చేశారు. అలాంటి దర్శకుడు నాతో సినిమా చేస్తాడా అని ఆలోచించే వాడిని. కానీ గద్దలకొండ గణేష్ చిత్రంలో ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చింది అని వరుణ్ తెలిపాడు. 

రిలీజ్ కు కొన్ని గంటల ముందు వాల్మీకి టైటిల్ ని గద్దలకొండ గణేష్ గా మార్చాం. ఆ విషయం మీ అందరికి తెలుసు. ఆ టైంలో నాకు చాలా భయమేసింది. ఈ సమయంలో టైటిల్ మార్చితే పరిస్థితులు ఎలా ఉంటాయో అని టెన్షన్ పడ్డా. వెంటనే చరణ్ అన్నకు ఫోన్ చేసి చెప్పా. వెంటనే ఇంటికిరా అని పిలిచాడు. 

ఆయన ఇంటికి వెళ్లగానే ఇంట్లో చరణన్న, జూ. ఎన్టీఆర్ గారు ఇద్దరూ కాఫీ తాగుతూ కనిపించారు. తక్కువ సమయంలోనే నా భయాన్ని మొత్తం పోగొట్టారు. చరణ్ అన్న, ఎన్టీఆర్ గారు నాలో ధైర్యాన్ని నింపిన ఆ సంఘటనని ఎప్పటికి మరచిపోలేను అని వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ సక్సెస్ మీట్ లో పేర్కొన్నాడు.