ఇటీవల విడుదలైన వాల్మీకి టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. వాల్మీకి చిత్రంలో వరుణ్ తేజ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో హరీష్ శంకర్ టీజర్ లో చూపించాడు. ప్రేక్షకులను ఎంతగానో ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ తాజాగా విడుదలయింది. ఈ ట్రైలర్ లో వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్' గా చేయబోయే విధ్వంసం చూపించారు. 

ఓ మంచి సినిమా తీయాలనే కసితో ఉన్న దర్శకుడిగా అథర్వ ఈ చిత్రంలో కనిపిస్తున్నాడు. 'ఫామ్ హౌస్ లో ఉన్న డాన్ ని కాదురా.. ఫామ్ లో ఉన్న గ్యాంగ్ స్టర్ ని వెతికి పట్టుకోవాలి' అని అథర్వ డైలాగ్ చెప్పగానే వరుణ్ తేజ్ ఎంట్రీ ఇస్తాడు. మంచి ఫాలోయింగ్ ఉన్న గ్యాంగ్ స్టర్ గా వరుణ్ తేజ్ తన పేరు గద్దలకొండ గణేష్ అని ప్రకటిస్తాడు. 

'నాపైన పందాలేస్తే గెలుస్తరు.. నాతోటి పందాలేస్తే చస్తరు' అంటూ వరుణ్ తేజ్ చెప్పే మాస్ డైలాగ్ ఆకట్టుకుంటోంది. కమెడియన్ సత్య, బ్రహ్మాజీ మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రంలోని ప్రెస్ మీట్ సీన్ స్పూఫ్ చేయడం చాలా సరదాగా ఉంది. 

ఇక పూజా హెగ్డే, వరుణ్ తేజ్ మధ్య వచ్చే లవ్ సీన్స్ ప్రేక్షకులకు కన్నుల పండుగలా ఉండబోతోంది. పూజా కనిపించగానే బ్యాగ్రౌండ్ లో శ్రీదేవి సూపర్ హిట్ సాంగ్ ఎల్లువొచ్చు గోదారమ్మ అనే పాట మ్యూజిక్ వినిపిస్తోంది. ప్రతి సన్నివేశంలో హరీష్ శంకర్ వరుణ్ తేజ్ మాస్ యాంగిల్ ని ఎలివేట్ చేశాడు. గద్దలకొండ గణేష్ అనే గజ గజ గజ వణకాలి అంటూ వరుణ్ చెప్పే డైలాగ్ ఈ చిత్రంలో మాస్ సీన్స్ ఎలా ఉండబోతున్నాయో తెలియజేస్తోంది. 

ఓవరాల్ గా సినిమాపై అంచనాలు పెంచే విధంగా వాల్మీకి ట్రైలర్ ఉంది. తమిళ సూపర్ హిట్ చిత్రం జిగర్తాండకు రీమేక్ గా హరీష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సెప్టెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 14 రీల్స్ సంస్థ నిర్మాణంలో వాల్మీకి తెరకెక్కుతోంది.