మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బుధవారం రోజు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. వనపర్తి జిల్లాలో వరుణ్ తేజ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ వార్త తెలిసినప్పటి నుంచి వరుణ్ తేజ్ ని విష్ చేస్తూ చాలా మంది అభిమానులు, ప్రముఖులు సోషల్ మీడియాలో స్పందించారు. 

కారు ధ్వంసమైనా వరుణ్ తేజ్ అదృష్టవశాత్తూ ఎలాంటి గాయాలకు గురికాలేదు. కానీ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరక్కుతున్న వాల్మీకి చిత్ర షూటింగ్ యధావిధిగా కొనసాగుతోంది. పుణ్యక్షేత్రమైన యాగంటిలో హరీష్ శంకర్ వాల్మీకి చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు. 

షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ ని హరీష్ శంకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పరమశివుడి ఆశీస్సులతో యాగంటి లోని అద్భుతమైన లొకేషన్ లో షూటింగ్ ప్రారంభించినట్లు హరీష్ శంకర్ తెలిపాడు. తమిళ సూపర్ హిట్ మూవీ జిగర్తాండకు ఇది తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నెగిటివ్ షేడ్స్ ఉండే పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం వరుణ్ గడ్డం లుక్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.