హీరో వరుణ్ సందేశ్ పరిచయ చిత్రం హ్యాపీ డేస్ తర్వాత వరస బిజీ అయ్యారు.  లవర్ బోయ్ ఇమేజ్ తో కొంతదూరం కెరీర్ ని లాక్కెళ్లాడు. తర్వాత వచ్చి హిట్టైన కొత్తబంగాలోకం సినిమాతో యూత్ లో  మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తరవాత ఒక్క సినిమా కూడా హిట్ అవ్వక మెల్లిగా మరగునపడిపోయారు. 

కొద్ది కాలం క్రితం వివాహం చేసుకుని, అమెరికా వెళ్లి  కొత్త జీవితం ప్రారంభించారు. మళ్లీ సినిమాలపై మనసైనట్లుంది. వచ్చి మళ్లీ కథలు విని ఓ సినిమా ఓకే చేసారు. ఆ సినిమానే దాడి. ఈ సినిమా రీసెంట్ గా లాంచ్ అయ్యింది. ఈ సినిమాతో వరుణ్ సందేశ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాపై మంచి అంచనాలే పెట్టుకున్నట్లు ఆయన మాటల్లో అర్దమవుతోంది. 

వరుణ్ సందేశ్ మాట్లాడుతూ..‘‘అమెరికా నుంచి ఏడాది తర్వాత తిరిగి వచ్చాక విన్న కథల్లో ‘దాడి’ నచ్చింది. గోకుల్‌ చాట్‌ బాంబు దాడిలో కుటుంబాన్ని కోల్పోయిన వ్యక్తి పాత్రలో కనిపిస్తా. ఆ తర్వాత వరుసగా జరుగుతున్న అలాంటి పరిణామాల వెనక అసలు నిజాన్ని రాబట్టడానికి జర్నలిస్ట్‌గా మారి ఏం చేశానన్నదే ఈ చిత్రకథ. ఈ సినిమా తర్వాత చంద్రమహేశ్‌గారి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నా’’  అన్నారు. జీవన్, చెరిష్మా శ్రీకర్, కారుణ్య చౌదరి ముఖ్య తారలుగా వరుణ్‌ సందేశ్‌ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘దాడి’.

దర్శకుడు మధు శోభ.టి మాట్లాడుతూ– ‘‘యూత్‌కు మంచి మెసేజ్‌ కూడా ఉంటుంది. సమాజంలో జరుగుతున్న పరిణామాల వెనకున్న చీకటి కోణాలను వెలికి తీసే జర్నలిస్ట్‌ కథ ఇది’’ అన్నారు. ‘‘మధు చెప్పిన కథ నచ్చడంతో నిర్మాతగా మారా. ఫిబ్రవరిలో రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తున్నాం’’ అని శంకర్‌ ఆరా అన్నారు. మధు శోభ.టి దర్శకత్వంలో శంకర్‌ ఆరా, జయరాజు.టి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: ప్రసాద్‌ ఈదర, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వెంకటేశ్‌.