సినీ నటులు జీవితాలు అనుకున్నంత ఆనందంగా ఉండవు. పైకి కనిపించినంత గ్లామర్ గా నిజ జీవితం ఉండదు. ఇప్పటికే చాలా మంది సినీ నటులు వైవాహిక జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. గత కొంతకాలంగా  ప్రముఖ ఒడిశా నటి వర్ష ప్రియదర్శిని, ఆమె భర్త బీజేపీ ఎంపీ అనుభవ్ మొహంతి(మాజీ నటుడు)ల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి.  ఇప్పటికే వర్ష నుంచి విడాకులు కోరుతూ అనుభవ్ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ క్రమంలోనే వర్ష ప్రియదర్శిని మరోసారి పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణం ఓ వీడియో కావటం చెప్పుకోదగ్గ అంశం.

 సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న ఓ వీడియోకు సంబంధించి ఆమె కటక్‌లోని పూరి ఘాట్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ వీడియోను ఉద్దేశపూర్వకంగానే వైరల్ చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  తన ఫేమ్‌ను డ్యామేజ్‌ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. అంతకు ముందు కూడా సోషల్ మీడియా‌లో తన పోస్టులపై చేసిన అభ్యంతరకర కామెంట్స్‌ గురించి వర్ష పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్స్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌లను కూడా ఆమె పూరి ఘాట్ పోలీసులకు అందజేశారు.

అలాగే అదే సమయంలో  తన అత్తమామలపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాళ్లు తనను అనుభవ్ ఇంటి నుంచి వెళ్లగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. తనకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి లేఖ వచ్చిందని, వీలైనంత త్వరగా ఇంటిని ఖాళీ చేయాలని ఆ లేఖ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు. అదే విధంగా అనుభవ్ రెగ్యులర్‌ డ్రింకర్‌ అని వర్ష ఆరోపించారు.