Revanth Reddy: ఒక సినిమా సక్సెస్ కావడానికి భాష ముఖ్యం కాదు, టాలెంటే ముఖ్యం. మంచి కథ, అద్భుతమైన నటన ఉంటే ప్రేక్షకులు ఏ భాషా చిత్రాన్నైనా ఆదరిస్తారు. తెలుగు సినిమా ఈ రోజు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిందంటే ఇక్కడి నటీనటులు, టెక్నీషియన్ల కృషే కారణం' అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
'ఐకాన్ స్టార్' అల్లు అర్జున్ హాలీవుడ్‌కు వెళ్లాలి: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: టాలీవుడ్ 'ఐకాన్ స్టార్' అల్లు అర్జున్ క్రేజ్ ఇప్పుడు కేవలం సౌత్ ఇండియాకే పరిమితం కాలేదు. 'పుష్ప' సినిమా తర్వాత దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానులకు ఫాలోయింగ్ పెరిగింది. ఇదే విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ కేవలం భారతీయ సినిమాలకే పరిమితం కాకుండా, హాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టాలని సీఎం తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.
అల్లు సినిమాస్ ప్రారంభోత్సవంలో సీఎం
గురువారం హైదరాబాద్‌లో అల్లు అర్జున్ కి చెందిన 'అల్లు సినిమాస్' మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, రిబ్బన్ కట్ చేసి థియేటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదల, అల్లు అర్జున్ సాధించిన విజయాలను అభినందించారు.
బాలీవుడ్ కాలం ముగిసింది, ఇప్పుడు హాలీవుడ్ వంతు!
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, `ఒకప్పుడు మన తెలుగు సినిమాల కలెక్షన్లను బాలీవుడ్ సినిమాలతో పోల్చుకునేవాళ్లం. హిందీ సినిమాల రికార్డులను మన సినిమాలు బద్దలు కొడతాయా అని ఎదురుచూసేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. తెలుగు సినిమా ఇప్పుడు బాలీవుడ్‌ను దాటిపోయింది. మన పోటీ ఇకపై బాలీవుడ్‌తో కాదు, ప్రపంచ స్థాయి సినిమా అయిన హాలీవుడ్‌తోనే ఉండాలి` అని అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ, `అల్లు అర్జున్ లాంటి టాలెంట్ ఉన్న నటులు కేవలం పాన్-ఇండియా స్టార్‌గా ఉండిపోకూడదు. ఆయన హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించాలి. మన తెలుగు నటుల సత్తా ఏంటో ప్రపంచంలోని ప్రతీ మూలకు చేరాలి. తెలుగు సినిమాకు ఆ శక్తి ఉంది` అని చెప్పారు సీఎం.
భాషకు హద్దులు లేవు:
సినిమా రంగంలో ఇప్పుడు భాషా పరమైన అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయని సీఎం అభిప్రాయపడ్డారు. `ఈ రోజుల్లో సినిమా హిట్టవ్వడానికి భాష ముఖ్యం కాదు, టాలెంటే ముఖ్యం. మంచి కథ, అద్భుతమైన నటన ఉంటే చాలు, ప్రేక్షకులు ఏ భాషా సినిమానైనా ఆదరిస్తారు. తెలుగు సినిమా ఈ రోజు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిందంటే ఇక్కడి నటీనటులు, టెక్నీషియన్ల కృషే కారణం` అని ఆయన అన్నారు.
చిత్ర పరిశ్రమకు ప్రభుత్వ సపోర్ట్
తెలంగాణ అభివృద్ధిలో సినిమా పరిశ్రమ పాత్ర ఎంతో ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. చిత్ర పరిశ్రమకు తమ ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. అల్లు అరవింద్, అల్లు అర్జున్ కుటుంబం థియేటర్ల నిర్మాణంతో సినిమా ప్రదర్శన రంగానికి చేస్తున్న సేవను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. రెండేళ్ల క్రితం `పుష్ప 2` రిలీజ్ టైమ్‌లో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారు. అప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ అయ్యింది. కానీ ఇప్పుడు ఆయన సినిమా థియేటర్ ఓపెనింగ్‌కి వెళ్లి ఆయనపై ప్రశంసలు కురిపించడం విశేషం.
ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో (AA22xA6) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్నారు. పాన్-ఇండియా స్థాయిలో దూసుకెళ్తున్న అల్లు అర్జున్‌కు సీఎం రేవంత్ రెడ్డి మాటలు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. తమ అభిమాన నటుడు హాలీవుడ్‌లో అడుగుపెట్టాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.


