జీవితంలో పెళ్లి జోలికి వెళ్లనని తేల్చి చెప్పింది నటి వరలక్ష్మీ శరత్ కుమార్. ప్రస్తుతం వరలక్ష్మీ హీరోయిన్ గా 'కన్నిరాశి' అనే సినిమాలో నటిస్తోంది. విమల్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాను ముత్తుకుమార్ డైరెక్ట్ చేస్తున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్రబృందం చెన్నైలోని ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు తనకు అవకాశం కల్పించిన నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. పెద్ద పోరాటం తరువాత ఈ సినిమా విడుదల వరకూ వచ్చిందని అన్నారు.

నటి వరలక్ష్మీ ఈ సినిమాకి కావలసినట్లుగా నటించారని.. యోగిబాబు, రోబో శంకర్ అధ్బుతంగా నటించారని చెప్పుకొచ్చారు. విమల్ మంచి నటుడని పొగిడిన ఆయన.. సినిమా కుటుంబ కథ నేపధ్యంలో సాగే కథ అని చెప్పారు. తాను ఇంతకు ముందు చాలా మంది హీరోయిన్లతో కలిసి నటించానని.. కానీ తొలిసారి ఒక మాగాడు లాంటి నటితో కలిసి నటించానని వరలక్ష్మిని ఉద్దేశిస్తూ విమల్ అన్నారు.

నటి వరలక్ష్మీ మాట్లాడుతూ సాధారణంగానే తనకు నూతన దర్శకులంటే ఇష్టమని.. ఈ సినిమా స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే కడుపుబ్బ నవ్వానని చెప్పారు. ఇది ప్రేమ పెళ్లి నేపధ్యంలో సాగే సినిమా అని.. నిజ జీవితంలో తనకు వివాహంపై నమ్మకం లేదని.. జీవితంలో తానేవరినీ పెళ్లి చేసుకోనని అన్నారు.