కొద్దిరోజులుగా ఆస్థి తగాదాలు, కుటుంబ వ్యవహారాలతో నటి వనితా విజయ్ కుమార్ వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల నటుడు కమల్ హాసన్ హోస్ట్ చేస్తోన్న 'బిగ్ బాస్ 3'లో కంటెస్టంట్ గా పాల్గొంది. 18 మంది సెలబ్రిటీలు సభ్యులుగా కలిగిన ఈ గేమ్ షోలో గత 7న నటి ఫాతిమాబాబు బయటకి వచ్చేసింది.

కాగా గత ఆదివారం మరో సంచలన నటి వనితా విజయ్ కుమార్ ఎలిమినేట్ అయింది. నిజానికి వనితా ఇంత త్వరగా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వస్తుందని ఎవరూ అనుకోలేదు. ఆమె హౌస్ లో ఉంటే రేటింగ్స్ పెరుగుతాయని బిగ్ బాస్ నిర్వాహకులు కూడా భావించారు. కానీ ఓటింగ్ విధానంలో ఆమె ఎలిమినేట్ అయింది.

బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన ఆమె ఓ ఇంటర్వ్యూలో తాను ఎలిమినేట్ అవుతానని ఊహించలేదని చెప్పింది. అయితే తను హౌస్ లో ఉండాలని అభిమానులు సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేయడం సంతోషం కలిగించిందని చెప్పింది. హౌస్ లో తనకు ఎలాంటి లోటు జరగలేదని తెలిపింది.

బిగ్ బాస్ హౌస్ లో ఆడ, మగ ప్రేమలో పడుతుంటారని.. అదే విధంగా తాను కూడా ప్రేమలో పడతానని ప్రేక్షకులు భావించారని.. కానీ తానేవరినీ ప్రేమించలేదని చెప్పింది. అలాంటి తప్పు తాను ఎప్పటికీ చేయనని అంది.

తాను ముగ్గురు పిల్లలకు తల్లిని కాబట్టి తనకు బాధ్యత ఉందని.. అయితే ఇతరులు ప్రేమలో పడడంలో తప్పులేదని  వెల్లడించింది. త్వరలోనే వనితా ఓ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించింది.