ప్రముఖ సీనియర్ నటుడు విజయ్ కుమార్ కూతురు వనిత ఈ మధ్యకాలంలో తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. తండ్రితో ఆస్తుల గొడవలతో కోర్టుకెక్కిన ఈమెపై ఇటీవల కిడ్నాప్ కేసు కూడా పెట్టారు.

స్కూల్ కు వెళ్లిన తన కుమార్తె జోనితను వనిత కిడ్నాప్ చేసిందని హైదరాబాద్ కు చెందిన ఆమె మాజీ భర్త ఆనంద్ రాజ్ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షోలో వనిత పాల్గొన్న విషయం తెలుసుకున్న ఆయన తెలంగాణా పోలీసులతో స్థానిక నాజరత్ పేట పోలీసుల సహాయంతో బుధవారం ఉదయం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వనిత వద్ద సుమారు రెండు గంటల పాటు విచారణ చేపట్టారు.

అనంతరం ఆమె సాయంత్రం 5 గంటలకు తన కుమార్తెను పోలీసుల ముందు హాజరుపరుస్తానని చెప్పింది. దీంతో వనిత కుమార్తెను ఆమె న్యాయవాది సహాయంతో పోలీసుల ముందు హాజరుపరిచారు. 

తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఇష్టపూర్వకంగా తన తల్లితో వచ్చానని, ఆమె దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నట్లు జోనిత వాంగ్మూలం ఇవ్వడంతో వనిత కిడ్నాప్ కేసు నుండి బయటపడింది. ప్రస్తుతం వనిత బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతోంది.