దర్శకుడు వంశీపైడిపల్లి రూపొందించిన 'మహర్షి' సినిమా ఇటీవల విడుదలై సక్సెస్ అందుకుంది. మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. తాజాగా వంశీ పైడిపల్లి ఓ టీవీ షోకి హాజరయ్యారు. అందులో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.

దర్శకుడిగా కాకముందు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసేవాడినని సినిమాల మీద ఇష్టం ఉద్యోగం మానేసి జయంత్ గారి దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయినట్లు చెప్పారు. తనకు మొదటి సినిమా అవకాశం 'మున్నా' చాలా ఈజీగా వచ్చిందని.. కానీ ఆ సినిమా సక్సెస్ కాకపోవడంతో కొంతకాలం గ్యాప్ తీసుకొని మళ్లీ కథలు రాసుకున్నట్లు చెప్పారు.

తనకు సినిమాలంటే ఎంత పిచ్చంటే.. చిన్నప్పుడు తన తల్లికి తెలియకుండా డబ్బులు తీసి వాటితో సినిమా చూసేవాడినని చెప్పాడు. తన తండ్రికి థియేటర్ ఉండడంతో ఎక్కువ సమయంలో అక్కడే గడిపేవాడినని చెప్పారు. అయితే ఓసారి తను సినిమా చూస్తున్న థియేటర్ నుండి కొట్టి బయటకి పంపించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

'ప్రేమదేశం' సినిమా కోసం లాఠీ దెబ్బలు తిన్నానని అన్నారు. ఆ సినిమాలో ప్రతీ సన్నివేశాన్ని ఎంజాయ్ చేసేవాడినని, అలా థియేటర్ లో గోల చేస్తుంటే.. తనను కొట్టి థియేటర్ నుండి పంపించేశారని, ఇప్పుడు అదే థియేటర్ లో తను డైరెక్ట్ చేసిన 'మహర్షి' సినిమా ఆడుతుందని అన్నారు. ప్రస్తుతం విహారయాత్రకి వెళ్తున్నట్లు, తిరిగి వచ్చిన తరువాత తన తదుపరి సినిమా అనౌన్స్ చేస్తానని చెప్పాడు.