సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం గురువారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. తొలి రోజు మహర్షి చిత్రానికి మంచి ఓపెనింగ్స్ దక్కాయి. మహర్షి చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో 24 కోట్ల షేర్ రాబట్టింది. టాలీవుడ్ లో ఐదవ అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా మహర్షి నిలిచింది. కానీ ఈ చిత్ర నిడివి దాదాపు 3 గంటలు ఉండడంతో కాస్త సాగదీసినట్లు ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. 

కొద్దిసేపటి క్రితమే చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు, వంశీ పైడిపల్లి, పూజా హెగ్డే, దేవిశ్రీ ప్రసాద్ పాల్గొన్నారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మహర్షి చిత్రం విడుదలయ్యాక నాకు చాలా ఫోన్స్ వస్తున్నాయి. ఈ చిత్రంలో వినోదంతో పాటు, సందేశం కూడా ఉందని అందరూ ప్రశంసిస్తున్నారు అని వంశీ తెలిపాడు. 

కొంతమంది సెకండ్ హాఫ్ సాగదీసినట్లుగా ఉందని అంటున్నారు. కానీ అసలు అది ఆలోచించాల్సిన విషయమే కాదు అని వంశీపైడిపల్లి అభిప్రాయపడ్డారు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లేకుండా వెంటనే క్లైమాక్స్ వచ్చేయదు కదా అని వంశీ తెలిపారు. చివరి సినిమా ప్రేక్షకులకు నచ్చిందా లేదా అనేదే ముఖ్యం. ఇప్పటివరకు నాకు ఫోన్ చేసినవారిలో మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ఫోన్ చాలా ప్రత్యేకం. 

చాలా కాల్స్ వస్తుండడంతో ఎవరు ఫోన్ చేస్తున్నారో అర్థం కాలేదు. ఓ నంబర్ నుంచి ఫోన్ వస్తే లిఫ్ట్ చేసి ఎవరని అడిగా. నేను చిరంజీవిని అని అన్నారు. వెంటనే నా ఒళ్ళు గగుర్పొడిచింది. కేవలం మహర్షి చిత్రం గురించే చిరంజీవి నాతో ఐదునిమిషాలు మాట్లాడారు. సినిమా అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు. చాలా స్నేహపూర్వకంగా మాట్లాడుతూ.. నా ఫోన్ నంబర్ ఇదే.. సేవ్ చేసుకోండి వంశీ అని చిరు తనతో చెప్పినట్లు వంశీ పైడిపల్లి వివరించారు.