సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు చిత్రం ‘మహర్షి’ జాతీయ అవార్డును దక్కించుకున్న సంగతి తెలిసిందే. అత్య‌ధిక ప్ర‌జాద‌ర‌ణ పొందిన సినిమా విభాగంలో అవార్డు సొంతం చేసుకుంది. అయితే.. ఈ సినిమా సెట్స్  మీదకు వెళ్లకముందే.. జాతీయ అవార్డు సాధిస్తుందని చెప్పాడు ప్రిన్స్ మహేష్. ఇందుకు సంబంధించిన స్క్ర్రీన్ షాట్ పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు దర్శకుడు వంశీ. ఇప్పుడీ పోస్ట్ వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే...67వ జాతీయ అవార్డుల ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఈసారి తెలుగు చిత్రాలు కూడా మంచి స‌త్తాను చాటాయి. జెర్సీ, మ‌హ‌ర్షి చిత్రాలు జాతీయ అవార్డుల‌ను సొంతం చేసుకున్నాయి. జెర్సీకి ఉత్త‌మ తెలుగు చిత్రం, బెస్ట్ ఎడిట‌ర్ (న‌వీన్ నూలి) విభాగాల్లో జాతీయ అవార్డులు ల‌భించాయి. అలాగే మ‌హ‌ర్షికి ఉత్తమ వినోదాత్మ‌క చిత్రం, ఉత్త‌మ కొరియోగ్ర‌ఫీ, ఉత్తమ నిర్మాణ సంస్థ విభాగాల్లో అవార్డులు ల‌భించాయి. ఈ నేప‌థ్యంలో ఈ రెండు టీమ్‌ల‌కు అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. మ‌రోవైపు ఈ రెండు సినిమా టీమ్‌లు కూడా సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి. 

ఈ నేప‌థ్యంలో మ‌హ‌ర్షి ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మ‌హ‌ర్షి టీమ్ మొత్తానికి థ్యాంక్స్ చెబుతూ.. ప్రేక్ష‌కుల మ‌ద్ద‌తు లేక‌పోతే ఇంత‌టి విజ‌యం వ‌చ్చేది కాద‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. అంతేకాదు మ‌హేష్‌తో చాట్‌ను కూడా రివీల్ చేశారు. ఆ చాట్ ఊపిరి సినిమాకు గానూ వంశీ పైడిప‌ల్లికి ఫిలింఫేర్ వ‌చ్చిన స‌మ‌యంలో మ‌హేష్ బాబు చేశారు.
 
https://twitter.com/directorvamshi/status/1374251701062963201

అందులో కంగ్రాట్స్ వంశీ. నీకు వ‌చ్చిన అవార్డు గురించి ఇప్పుడే విన్నాను. నెక్ట్స్ మూవీకి క‌చ్చితంగా నేష‌న‌ల్ అవార్డు రావాలి అని మ‌హేష్ మెసేజ్ చేయ‌గా.. థ్యాంక్యు స‌ర్. మ‌నం క‌చ్చితంగా దీన్ని సాధిద్దాం అని వంశీ రిప్లై ఇచ్చారు. ఆ త‌రువాత మ‌హేష్ బాబు.. మ‌న చిత్రం కోసం ఏం కావాల‌న్నా చెప్పు నేను ఉంటాను. ఈ చిత్రాన్ని మనం క‌చ్చితంగా నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లాలి అని మ‌హేష్ బాబు మెసేజ్ పెట్టారు. 

దీన్ని షేర్ చేసిన వంశీపైడిప‌ల్లి.. మ‌హ‌ర్షిపై మీ న‌మ్మ‌కం ఇవాళ ఈ రోజును ఇచ్చింది. 2017లో నా చిత్రం ఊపిరికి ఫిలిం ఫేర్ వ‌చ్చిన స‌మ‌యంలో మీరు నాకు పెట్టిన మెసేజ్‌ల స్క్రీన్ షాట్‌ను షేర్ చేసుకుంటున్నా. మీ మాట‌లే నిజ‌మ‌య్యాయి. థ్యాంక్యు స‌ర్ అని కామెంట్ పెట్టారు.