మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం వాల్మీకి. హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే హరీష్ మెగా హీరోలకు గబ్బర్ సింగ్, డీజే, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ రూపంలో మూడు హిట్స్ అందించాడు. దీనితో వాల్మీకి చిత్రంపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. 

తమిళ సూపర్ హిట్ చిత్రం జిగర్తాండకు రీమేక్ గా వాల్మీకి తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ పాత్ర నెగిటివ్ షేడ్స్ తో ఉండబోతోంది. హాట్ బ్యూటీ పూజా హెగ్డే ఈ చిత్రంలో నటిస్తోంది. పూజా హెగ్డే పాత్ర నిడివి చాలా తక్కువ. అయినా పూజా చేరికతో మంచి హైప్ వచ్చింది. ఇవన్నీ ఈ చిత్రానికి సంబంధించిన పాజిటివ్ అంశాలు. 

ఈ చిత్ర టైటిల్ ప్రకటన నుంచి వివాదాలు వెంటాడుతున్నాయి. కమర్షియల్ చిత్రానికి వాల్మీకి పేరు పెట్టడం ఏంటని ఇప్పటికే కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా దర్శకుడికి, నిర్మాతకు మధ్య విభేదాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం బడ్జెట్ విషయంలో నిర్మాతలు, దర్శకుడు ఏకాభిప్రాయంతో లేరట. 

హరీష్ ముందుగా ఈ చిత్రాన్ని 20 కోట్ల బడ్జెట్ లోపు పూర్తి చేస్తానని చెప్పాడట. కానీ వాల్మీకి చిత్ర బడ్జెట్ అంతకు మించి పోతున్నట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే పాత్ర చిన్నదైనప్పటికీ భారీ మొత్తంలో చెల్లించినట్లు తెలుస్తోంది. 14 రీల్స్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.