ప్రభాస్ నటించిన 'సాహో' సినిమా ఆగస్ట్ 30న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేయగానే.. ఆ సమయానికి రావాలనుకున్న నాని 'గ్యాంగ్ లీడర్' సినిమా చిక్కుల్లో పడింది. ఆగస్ట్ 30కి తగ్గట్లు టీమ్ మొత్తం ప్లాన్ చేసుకొంది. కానీ సడెన్ గా 'సాహో' రావడంతో నాని తన సినిమాను వాయిదా వేసుకోక తప్పలేదు.

కనీసం 'సై రా' వాయిదా పడితే గాంధీ జయంతి రోజు విడుదల చేయాలనుకున్నారు. కానీ చిరంజీవి సినిమా వాయిదా పడదని క్లారిటీ ఇవ్వడంతో 'గ్యాంగ్ లీడర్' సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ కారణంగా నానికి సోలో రిలీజ్ దొరకడం లేదు. సెప్టెంబర్ 13న 'వాల్మీకి' సినిమా రిలీజ్ అవుతోంది కాబట్టి నాని సినిమాకి పోటీ తప్పదని అనుకున్నారు.

రెండు చిత్రాల నిర్మాతలు అదే డేట్ న రావాలని భావించడంతో క్లాష్ తప్పదని భావించారు. కానీ ఇప్పుడు వరుణ్ తేజ్ 'వాల్మీకి' వెనక్కి తగ్గినట్లు సమాచారం. 'వాల్మీకి' ఒక వారం వెనక్కు వెళ్తే బెటర్ అని డిస్ట్రిబ్యూషన్ పెద్దలైన దిల్ రాజు, అల్లు అరవింద్ లు సలహా ఇవ్వడంతో నిర్మాతలు అంగీకరించినట్లు తెలుస్తోంది.

గత మూడు రోజులుగా దీనిపై చర్చలు జరగగా.. ఫైనల్ గా 'వాల్మీకి' ఓ వారం వెనక్కి వెళ్లాలని నిర్ణయించుకుంది. సెప్టెంబర్ 20న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఒకట్రెండు రోజుల్లో దీనిపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.