మొదటి చిత్రంతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు హీరో వైష్ణవ్ తేజ్. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఉప్పెన రికార్డు వసూళ్లు రాబట్టింది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కీలక రోల్ చేశారు. ఉప్పెన విజయంతో ఊపుమీదున్న వైష్ణవ్ కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. సీనియర్  నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఎస్వీసి బ్యానర్ లో ఈ నూతన చిత్రం తెరకెక్కనుంది. 


వైష్ణవ్ కి జంటగా కేతిక శర్మ నటిస్తున్నారు. ఇక అర్జున్ రెడ్డి చిత్రాన్ని తమిళంలో ఆదిత్య వర్మ పేరుతో తెరకెక్కించిన దర్శకుడు గిరీశాయ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. నేడు హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. హీరో వైష్ణవ్, హీరోయిన్ కేతిక శర్మ, దర్శక నిర్మాతలు ఈ వేడుకలో పాల్గొన్నారు. 


సాయిధరమ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరై, వైష్ణవ్, కేతిక శర్మపై క్లాప్ కొట్టారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఉప్పెన తరువాత వైష్ణవ్ క్రిష్ దర్శకత్వంలో ఓ మూవీ చేశారు. రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించిన ఆ చిత్రం విడుదల కావాల్సి ఉంది.