ప్రభాస్ ది మంచి మనస్సు. తనతో జర్నీ చేసిన వాళ్లను ఆయన సొంత మనష్యులుగా చూసుకుంటారు. అలాగే తన కెరీర్ లో పెద్ద హిట్ ఇచ్చిన ‘వర్షం’ దర్శకుడు శోభన్ అంటే ఆయన చాలా ఇష్టం. ‘వర్షం’ సినిమాతో ప్రభాస్ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమాతో శోభన్, ప్రభాస్ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అయితే, 2008లో శోభన్ గుండెపోటుతో అకాల మరణం చెందారు. అయినప్పటికీ శోభన్ ఫ్యామిలీతో తన అనుభంధాన్ని కొనసాగిస్తున్నారు ప్రభాస్. శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన ‘పేపర్ బోయ్’ సినిమాకు ప్రభాస్ ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఆ సినిమా వర్కవుట్ అవ్వలేదు. 

దాంతో  సంతోష్ శోభన్ కు తనే బ్రేక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో  యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో ఆ కుర్రాడు హీరోగా రెండు సినిమాలను ఓకే చేయించినట్లు సమాచారం.  ఈ రెండు సినిమాలకు సంతోష్ పేరును ప్రభాసే రికమండ్ చేశారని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ ప్రభాస్ సొంత బ్యానర్ అన్న సంగతి తెలిసిందే. ఈ నిర్మాణ సంస్థకు ప్రభాస్ ఫ్రెండ్స్ వంశీ, ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రభాస్ సూచన మేరకు సంతోష్‌తో రెండు సినిమాలు నిర్మించేందుకు యూవీ క్రియేషన్స్ సన్నద్ధమవుతోంది. అందులో భాగంగా మొదట ఓ సినిమా మొదలైంది. 

 యు.వి.క్రియేషన్స్ కి అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మొదలు పెట్టారు. ఈ బ్యాన‌ర్ లో నిర్మాణం పూర్తి చేసుకున్న’ ఏక్ మినీ కథ’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. ‘డజ్ సైజ్ మ్యాటర్’  అంటూ పోస్టర్ లో ఉన్న మ్యాటర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.   సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇందులో లుక్ కు మంచి స్పందన వస్తుంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ సినిమాకు కథ అందించారు. 

కార్తీక్ రాపోలు ‘ఏక్ మినీ కథ’ చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నారు. సత్య ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.