మెగా మేనల్లుడు, సాయి ధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా సినిమా ఇంకా ప్రారంభమే కాలేదు. కానీ రోజుకో వార్తతో  మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా టైటిల్ విషయంలో ఈ సినిమాపై ఆసక్తికరమైన డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాకు ‘జాలరి’ అనే టైటిల్ పెట్టనున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అవేమీ నిజం కాదని తేలిపోయింది.

తాజాగా మరో ఆసక్తికమైన  టైటిల్‌ తెర మీదకు వచ్చింది. గోదావిరి జిల్లా జాలర్ల జీవితాల నేపథ్యంలో ఎమోషనల్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘ఉప్పెన’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా చెప్తున్నారు. క్లైమాక్స్ లో సముద్రంలో ఉప్పెన వస్తుందని, అది లవ్ స్టోరికి ముడిపడి ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే  ఈ టైటిల్‌ను చిత్ర నిర్మాతలు రిజిస్టర్ చేయించారట. 

ఈ చిత్రానికి సంబంధించి వదిలిన  ప్రీ లుక్‌తోనే ఆకట్టుకుంది టీమ్. ఇప్పుడు చిత్రం టైటిల్ విషయంలోనూ అదే స్టైల్ లో ఆలోచిస్తోంది చిత్రయూనిట్. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ  చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.