గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాలలో 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమా ఒకటి. దీంతో పాటు విడుదలైన సినిమాల సంగతి ఎలా ఉన్నా.. ఏజెంట్ ఆత్రేయకి మాత్రం మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా కలెక్షన్స్ కూడా బాగున్నాయి.

అయితే ఈ సినిమా నాని నటిస్తోన్న 'గ్యాంగ్ లీడర్' చిత్రానికి సమస్యగా మారిందని సమాచారం. దానికి కారణమేమిటంటే.. ఈ రెండు సినిమాల్లో కొన్ని సన్నివేశాలకు పోలిక ఉందట. నాని 'గ్యాంగ్ లీడర్' కూడా ఏజెంట్ ఆత్రేయ మాదిరిఇన్వెస్టిగేషన్ నేపధ్యంలో సాగుతోంది.

అయితే నాని సినిమా కథలో చాలా మలుపులు ఉంటాయట.. అలాంటి కొన్ని ఎపిసోడ్స్ 'ఏజెంట్ ఆత్రేయ'లో కూడా ఉన్నాయట. దాంతో నాని సినిమా ఇప్పుడు ఇబ్బందుల్లో పడినట్లు  సమాచారం. ఈ రెండు సినిమాలకు లింకులు ఉన్నాయంటే.. కచ్చితంగా ఏ హాలీవుడ్ సినిమా నుండో స్పూర్తి పొందిన కథలై ఉంటాయని ఇండస్ట్రీవర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

ఇప్పుడు నాని 'గ్యాంగ్ లీడర్ ' విడుదలైతే కచ్చితంగా పోలికలు వస్తాయని భయపడుతున్నారు. అందుకే సినిమాలో కొన్ని సన్నివేశాలను మార్చి రీషూట్ చేయాలని భావిస్తున్నారు.  రీషూట్ జరిపితే సినిమా మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. ఆగస్ట్ లో సినిమా రిలీజ్ ఉంటుందని ముందే చెప్పేశారు. మరి చెప్పినట్లుగా ఆగస్ట్ లో రిలీజ్ చేస్తారో లేదో చూడాలి!