ఇటీవల 'చిత్రలహరి' సినిమాతో సక్సెస్ అందుకున్న నటుడు సాయి తేజ్ ఇప్పుడు తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. దర్శకుడు మారుతితో కలిసి పని చేయబోతున్నాడు.

గీతాఆర్ట్స్ లో మారుతి తీసిన 'భలే భలే మగాడివోయ్', 'మహానుభావుడు' చిత్రాలు సక్సెస్ కావడంతో మరోసారి గీతాఆర్ట్స్ అతడిని లాక్ చేసింది. సాయి తేజ్ హీరోగా ప్రాజెక్ట్ సెట్ చేసింది. ఈ సినిమా ఫ్యామిలీ, ఎమోషన్స్ ప్రధానంగా సాగుతుందని తెలుస్తోంది. తాత-తండ్రి-మనవడు మధ్య జరిగే కథే ఇది.

ఓ తండ్రిని కొడుకు ఎలా మార్చాడనే కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కనుంది. రాజమండ్రి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగుతుందట. ప్రస్తుతం లోకేషన్ల కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఓ విదేశీ సినిమా స్పూర్తిగా ఈ సినిమా కథ ఉంటుందని సమాచారం. ఆ కథకు మారుతి తనదైన స్టైల్ లో కోటింగ్ ఇచ్చి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట.

ఈ సినిమా కోసం తేజు బరువు తగ్గే పనిలో పడ్డాడు. బరువు తగ్గి కొత్త లుక్ తో ఈ సినిమాలో కనిపించాలని భావిస్తున్నాడు. జూన్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.