ఎలెక్షన్ కోడ్ అమలులో ఉండగా.. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఏపీలో విడుదల కాకుండా ఎలెక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్నికలు పూర్తి  కావడంతో మే 1న సినిమా విడుదల చేస్తున్నట్లు చిత్ర దర్శకనిర్మాతలు అనౌన్స్ చేశారు.

ఎన్నికల సంఘం అనుమతి తీసుకోకుండా మే 1న విడుదల చేస్తామని డేట్ అనౌన్స్ చేయడంతో విస్మయం వ్యక్తమవుతోంది. ఎన్నికల నియమావళి అమలులో ఉండే మే 23 వరకు ఈ సినిమా విడుదల చేయకూడదు కానీ మే 1న సినిమా విడుదలకు నిర్మాతలు నిర్ణయం తీసుకోవడంతో ఉత్కంఠ నెలకొంది.

ఇది ఇలా ఉండగా.. ఏపీలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలకు సంబంధించి ఎలెక్షన్ కోడ్ అమల్లో ఉన్నంతవరకు తాము గతంలో జారీ చేసిన ఉత్తర్వులు వర్తిస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఈ విషయమై చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డికి ఏప్రిల్ 10న ఈసీ లేఖ రాసింది. 

తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవారూ సినిమాను విడుదల చేయొద్దని ఆదేశించింది. ఎన్నికల కోడ్ ముగిసేవరూ ఎన్నికలకు విఘాతం కలిగించే ఎలాంటి బయోపిక్ లు ప్రదర్శించడం కుదరదని నిబంధనల్లో ఉన్నట్లు వెల్లడించింది.