ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన నాలుగు చిత్రాల్లో 'ఎఫ్ 2' సినిమా సత్తా చాటింది. భారీ వసూళ్లతో కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాని నిర్మించిన నిర్మాతకు, సినిమాను కొన్న బయ్యర్లకు మంచి లాభాలు వచ్చాయి. 

అనీల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్. అది కూడా దిల్ రాజు బ్యానర్ లోనే ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేశాడు. 'ఎఫ్ 3' గా రాబోతున్న ఈ సినిమాలో కథ ప్రకారం మరో హీరో ఉంటాడని తెలుస్తోంది.

వెంకీ, వరుణ్ లతో పాటు మాస్ హీరో రవితేజని ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. గతంలో అనీల్ రావిపూడి తెరకెక్కించిన 'రాజా ది గ్రేట్' సినిమాలో రవితేజ హీరోగా నటించాడు. ఆ బంధంతోనే ఇప్పుడు 'ఎఫ్ 3' సీక్వెల్ లో మూడో హీరోగా రవితేజని అనుకుంటున్నారు.

కామెడీ విషయంలో రవితేజ టైమింగే వేరు. ఇక వెంకీ, రవితేజ కలిసి వెండితెరపై కనిపిస్తే ప్రేక్షకుల పొట్టలు చెక్కలవ్వడం ఖాయం. ప్రస్తుతం అనీల్ రావిపూడి బయట బ్యానర్ లో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయబోతున్నాడు. అది పూర్తయిన తరువాత లైన్ లో బాలయ్య సినిమా కూడా ఉంది. మరి 'ఎఫ్ 3' ఎప్పుడు తీస్తారో చూడాలి!