RC 16కి సన్నద్ధం... చరణ్ మూవీలో ఛాన్స్ కావాలా? ఇలా చేయండి!
రామ్ చరణ్ 16వ చిత్రం దర్శకుడు బుచ్చిబాబు సానా తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ మూవీ నుండి ఓ అప్డేట్ వచ్చింది. నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆగిపోయిన భారతీయుడు 2 తిరిగి పట్టాలెక్కిన నేపథ్యంలో గేమ్ ఛేంజర్ ఆలస్యం అవుతుంది. దర్శకుడు శంకర్ ఏక కాలంలో గేమ్ ఛేంజర్, భారతీయుడు 2 చిత్రాల షూటింగ్ జరుపుతున్నారు. అయితే అధిక సమయం భారతీయుడు 2 చిత్రానికి కేటాయిస్తున్నారు. గేమ్ ఛేంజర్ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు.
కాగా గేమ్ ఛేంజర్ అనంతరం రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబుతో మూవీ చేయనున్నాడు. రామ్ చరణ్-బుచ్చిబాబు మూవీపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ప్రీ ప్రొడక్షన్ పని మొదలైంది. కాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ పైకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. నిర్మాతలు కీలక అప్డేట్ ఇచ్చారు. రామ్ చరణ్ 16వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు.
ఈ మూవీ ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో నడిచే విలేజ్ స్పోర్ట్స్ డ్రామా అని సమాచారం. ఈ క్రమంలో అక్కడి స్థానిక నటుల కోసం వేట మొదలైంది. స్త్రీ, పురుషులు, చిన్న పిల్లలు... అన్ని ఏజ్ గ్రూప్స్ కి చెందినవారు ఆడిషన్స్ లో పాల్గొనవచ్చని తెలియజేశారు. కాబట్టి రామ్ చరణ్ మూవీలో నటించాలని కోరుకుంటున్నవారు ప్రయత్నం చేయవచ్చు.
ఫిబ్రవరి 5 నుండి 17 వరకు వరుసగా విజయనగరం, సాలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఆడిషన్స్ జరగనున్నాయి. కాగా ఉప్పెన మూవీతో బుచ్చిబాబు భారీ విజయం సొంతం చేసుకున్నాడు. ఏకంగా రెండో చిత్రంతోనే రామ్ చరణ్ వంటి టాప్ స్టార్ తో ఛాన్స్ పట్టేశాడు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.