మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ భార్య ఉపాసన  చేసే సామాజిక సేవా కార్యక్రమాలు గురించి అందరికీ తెలిసిందే.  ‘బి పాజిటివ్- హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్’ మ్యాగజైన్‌కు చీఫ్ ఎడిటర్‌గా ఉపాసన బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె ఖాళీ సమయాల్లో సామాజిక కార్యక్రమాలు చేస్తూంటారు. ఈ నేపధ్యంలో  ఉపాసన దాదాసాహెబ్ ఫాల్కే సామాజిక సేవా పురస్కారంకు ఎంపికయ్యారు. 'ఈ ఏటి మేటి పరోపకారి'గా ఉపాసనను ఎంపిక చేశారు.

తన అపోలో ఫౌండేషన్ ద్వారా ఆమె అందిస్తున్న సామాజిక సేవలకు గుర్తింపుగా ఈ విశిష్ట పురస్కారం లభించింది. దాదాసాహెబ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ సంస్థ ఈ అవార్డు ప్రకటించింది. భిన్నరంగాలకు చెందిన ప్రతిభావంతులకు, స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న వ్యక్తులను ఎంపిక చేసి ఈ అవార్డు అందిస్తున్నారు.

తనకు ఈ అవార్డు రావడం పట్ల ఉపాసన హర్షం వ్యక్తం చేశారు. "నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ప్రతిరోజు మంచి పనులు చేసేలా శుభసందేశాలు పంపించే సానుకూల దృక్పథం ఉన్న నా ప్రజలందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. నన్ను అన్నివిధాలా వెన్నంటి ఉండే నా ప్రియమైన కుటుంబానికి కృతజ్ఞతలు" అంటూ ఆమె ట్వీట్ చేశారు. 

ఈ సందర్భంగా రామ్ చరణ్.. ‘ప్రియమైన ఉప్సీ.. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నా’ అని తన భార్య ఉపాసనకు ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.