Bro Prerelease Event: ఎన్టీఆర్ వలె నేను డాన్స్ చేయలేకపోవచ్చు... నా సినిమా ఆర్ ఆర్ ఆర్ ని బీట్ చేయాలనుకుంటా!
బ్రో ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా మాట్లాడారు. ఆయన పలు విషయాలపై స్పందించారు. తన తోటి స్టార్స్ ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్, రామ్ చరణ్ ల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

బ్రో మూవీ ప్రీ రిలీజ్ వేడుకగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. వేడుకకు ఆలస్యంగా హాజరైన పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... త్రివిక్రమ్, నేను సాహిత్యం సైన్స్ గురించి మాట్లాడుకుంటాము. ఆయనకు కేవలం తెలుగు మీదే కాదు సంస్కృతం, హిందీ మీద పట్టుంది. పురాణాల గురించి తెలుసు. నేను ఒక గురువుగా చూస్తాను. ఆయన గొప్ప పండితుడు నాకు తెలియని విషయాలు అడిగి తెలుసుకుంటాను. అందుకే త్రివిక్రమ్ నా స్నేహితుడు అయ్యాడు.
రాజమౌళి తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. ఆయన స్పూర్తితో యువ దర్శకులు మన సినిమాను మరింత ముందుకు నడిపించాలి. రాజమౌళి స్ఫూర్తిని కొనసాగించాలి. మహేష్ బాబుతో రాజమౌళి చేయబోయే మూవీ మరింత విజయం సాధించాలని నేను కోరుకుంటాను. నేను ఎన్టీఆర్, రామ్ చరణ్ ల డాన్సులు చేయకపోవచ్చు. ప్రభాస్ లా ఏళ్ల తరబడి ఒక సినిమాకు కేటాయించకపోవచ్చు. రానాల కష్టపడి బాడీ బిల్డ్ చేయకపోవచ్చు. కానీ కష్టపడాలి అనుకుంటాను.
అదే సమయంలో నా సినిమా ఇతర హీరోల సినిమాల కంటే బాగా ఆడాలి అనుకుంటాను. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ కంటే పెద్ద విజయం సాధించాలని అనుకుంటాను. ఆ పోటీతత్వం లేకపోతే క్వాలిటీ రాదు. అందుకే కష్టపడి మంచి సినిమాలు చేయాలి అనుకుంటాను. అందరు హీరోలకు విజయాలు దక్కాలి. హీరోలు అంటే నాకు ఇష్టం. ఒక హీరో మూవీ చేస్తే వెయ్యి మంది బతుకుతారు. హీరోలు టాక్సులు కడతారు. హీరోలు దోపిడీలు చేయరు. ఎవరి సొమ్ము లాక్కోరు. అందుకే నాకు హీరోలంటే గౌరవం.
సాయి ధరమ్ తేజ్ హీరో అవుతాను అంటే నేను కాదనలేదు. అయితే పరీక్ష పెట్టాను. నా అక్క కొడుకు కాబట్టి నా బాధ్యతగా యాక్టింగ్ స్కూల్ లో చేర్పించాను. కొన్ని సలహాలు ఇచ్చాను. కానీ ఏ ఒక్క దర్శకుడికి నేను రిఫర్ చేయలేదు. తన లుక్స్ నచ్చి అవకాశాలు వచ్చాయి. సాయి ధరమ్ కి బ్రో సినిమా ఆఫర్ రావడానికి కేవలం త్రివిక్రమ్ కారణం. స్క్రిప్ట్ రెడీ అయ్యింది. సాయి ధరమ్ కోలుకోలేదు. వేరొకరిని చూద్దాం అంటే త్రివిక్రమ్ నేను సాయి ధరమ్ తేజ్ ని అనుకున్నాను, తనతోనే చేద్దాం అన్నాడు.
బ్రో షూటింగ్ బిగినింగ్ లో సాయి ధరమ్ ఇబ్బందిపడ్డాడు. డైలాగ్స్ అవీ సరిగా లేవు, నీకు ఓకేనా అని నేను సముద్రఖనిని అడిగాను. స్పీచ్ థెరపీతో సెట్ అవుతుంది, నో ప్రాబ్లమ్ అన్నాడు. అందులోనూ ఈ కథ సాయి ధరమ్ తేజ్ నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. సాయి ధరమ్ ని ప్రమాదం నుండి ఒక ముస్లిం సామాజిక వర్గం వ్యక్తి కాపాడాడు. అతనికి ధన్యవాదాలు. కోమాలోకి వెళ్ళిపోయిన సాయి ధరమ్ బ్రతుకుతాడో లేదో అని డాక్టర్స్ అన్నారు. అప్పుడు నేను దేవుణ్ణి వాడిని బ్రతికించమని కోరుకున్నాను. ఈరోజు ఇక్కడ ఉన్నాడంటే అది కేవలం డాక్టర్స్ పుణ్యమే. నిర్మాతలు సహకారంతో మూవీ పూర్తి చేయగలిగాను. సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు, అన్నారు.
పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల మల్టీస్టారర్ బ్రో గా తెరకెక్కింది. ఈ సోషియో ఫాంటసీ సోషల్ డ్రామా జులై 28న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. బ్రో మూవీ తమిళ చిత్రం వినోదయ సితం రీమేక్. ఒరిజినల్ కి దర్శకత్వం వహించిన సముద్ర ఖని తెలుగులో కూడా తెరకెక్కించారు. త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందించారు. కథలో కూడా మార్పులు చేసినట్లు సమాచారం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు. ఊర్వశి రాతెలా స్పెషల్ సాంగ్ చేశారు.