ప్రతి ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమా సందడి కనిపిస్తుంది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు తక్కువ గ్యాప్ లో విడుదలైతే వసూళ్ళలో నష్టం రావచ్చనే భయం నిర్మాతల్లో ఉంటుంది. కానీ సంక్రాంతికి ఆ సమస్య ఉండదు. సినిమా బాగుండాలి కానీ విడుదలైన ప్రతి చిత్రానికి ఆదరణ ఉంటుంది. 

ఈ సంక్రాంతికి రెండు భారీ చిత్రాల మధ్య పోటీ ఉండబోతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల.. వైకుంఠపురములో చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కథానాయకుడు. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి. 

ఇక సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న సరిలేరు నీ కెవ్వరు చిత్రం కూడా సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ తొలిసారి మహేష్ ని డైరెక్ట్ చేస్తుండడంతో ఈ అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. 

ఈ రెండు చిత్రాల విషయంలో ఇద్దరు సీనియర్ హీరోయిన్లు ప్రధాన ఆకర్షణగా మారారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చాలా కాలం తర్వాత వెండి తెరపై కనిపించబోతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. కీలకమైన పాత్రలో ఆమె కనిపించబోతున్నారు. ఒకప్పుడు తన అందంతో వేడెక్కించిన టబు కూడా చాలా కాలం తర్వాత టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. 

అలా వైకుంఠపురములో చిత్రంలో ఆమె కీలక పాత్రలో నటిస్తోంది. ఈ ఇద్దరి సీనియర్ హీరోయిన్ల రీ ఎంట్రీలో ఏ చిత్రం హైలైట్ గా నిలుస్తుందో అనే ఆసక్తి అభిమానుల్లో ఇప్పటి నుంచే నెలకొని ఉంది.