తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను 'ఫిదా' చేసిన సాయి పల్లవి రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి ఫాలోయింగ్ ని దక్కించుకుంది. నిన్న సాయి పల్లవి నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఇది ఆమె అభిమానులకు ట్రీట్ అనే చెప్పాలి. 'పడి పడి లేచే మనసు' సినిమాలో మెడికో అవతారమెత్తిన ఈ బ్యూటీ.. 'మారి2'లో మాత్రం ఆటోడ్రైవర్ గా మాస్ అవతారంలో కనిపించింది.

అయితే ఈ రెండు సినిమాలు కూడా అభిమానులను ఆకట్టుకోలేకపోయాయి. తనదైన నటనతో, డైలాగ్స్ తో సాయి పల్లవి ఎంతగా మెప్పించడానికి ప్రయత్నించినా.. సినిమాలు మాత్రం సక్సెస్ కాలేకపోయాయి. 'మారి2' డబ్బింగ్ సినిమా పైగా మొత్తం తమిళ ఫ్లేవర్ తో నిండిపోవడంతో మనవాళ్లకు పెద్దగా ఎక్కలేదు.

కానీ ఎన్నో అంచనాల మధ్య విడుదలైన 'పడి పడి లేచే మనసు' కూడా  ఏవరేజ్ టాక్ తెచ్చుకోవడంతో సాయి పల్లవి డీలా పడిందట. 'ఫిదా', 'ఎంసిఏ' సినిమాల తరువాత తెలుగులో మరిన్ని విజయాలు అందుకుంటుందని అనుకుంటే ఈ బ్యూటీకి మాత్రం నిరాశ తప్పడం లేదు.