పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన `హరిహర వీరమల్లు` మూవీ నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌ వచ్చింది. ఈ చిత్ర ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు నిర్మాతలు. 

పవన్‌ కళ్యాణ్‌ నటించిన `హరిహర వీరమల్లు` మూవీ అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ని ఎట్టకేలకు ఫైనల్‌ చేశారు. జులై 24న సినిమా ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. 

ఈ సారి గురి తప్పకుండా థియేటర్లోకి తీసుకురావాలని టీమ్‌ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో అదిరిపోయే వార్త వచ్చింది. ఎంతో కాలంగా పవన్‌ అభిమానులు వెయిట్‌ చేస్తున్న గుడ్‌ న్యూస్‌ వచ్చింది. ట్రైలర్‌ అప్‌ డేట్‌ ఇచ్చింది టీమ్‌.

`హరిహర వీరమల్లు` ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌

`హరిహర వీరమల్లు` మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ వచ్చింది. జులై 3న ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు వెల్లడించారు. అయితే గ్రాండ్‌ ఈవెంట్‌లో ఈ ట్రైలర్‌ని విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ చూడని శక్తివంతమైన చారిత్రక యోధుడు 'వీరమల్లు' పాత్రలో కనువిందు చేయనున్నారు. మొఘల్ నవాబ్‌ని ధిక్కరించిన ఓ ధైర్యవంతుడి ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నాం.

`హరిహర వీరమల్లు` బెస్ట్ ఔట్‌పుట్‌ కోసం మేకర్స్ ప్లాన్‌

క్రిష్ జాగర్లమూడి నుంచి 'హరి హర వీరమల్లు' చిత్ర దర్శకత్వ బాధ్యతలు అందుకున్న దర్శకుడు ఎ.ఎం. జ్యోతి కృష్ణ.. వెండితెరపై ఈ మూవీని ఆవిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన తుది మెరుగులు దిద్దుతున్నారు. 

ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఆడియెన్స్ కి బెస్ట్ ఔట్‌పుట్‌ ఇచ్చేందుకు టీమ్‌ శ్రమిస్తుందని నిర్మాతలు వెల్లడించారు.

ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన నాలుగు గీతాలకు విశేష స్పందన లభించింది. 'మాట వినాలి', 'కొల్లగొట్టినాదిరో', 'అసుర హననం', 'తార తార' గీతాలు ఒక దానిని మించి మరొకటి శ్రోతలను అలరించాయి.

`హరిహర వీరమల్లు`కి వర్క్ చేస్తున్న టెక్నీకల్‌ టీమ్‌

బాబీ డియోల్, నిధి అగర్వాల్ తో పాటు నటీనటులు 'హరి హర వీరమల్లు'లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ వి.ఎస్., మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి నభూతో నభవిష్యతి అన్నచందాన అద్భుతమైన సెట్ లను రూపొందించారు. ప్రతిభగల సాంకేతిక బృందం సహకారంతో ఈ చిత్రం విజువల్‌ వండర్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. 

ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న 'హరి హర వీరమల్లు' చిత్రం జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

`హరిహర వీరమల్లు`లో హైలైట్స్ 

చారిత్రాత్మక నేపథ్యంలో అద్భుతమైన నాటకీయత, శక్తివంతమైన ప్రదర్శనలు, ఉత్కంఠభరితమైన యాక్షన్ తో 'హరి హర వీరమల్లు' చిత్రం రూపుదిద్దుకుంటోంది. 

ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుందని చిత్ర బృందం ఎంతో నమ్మకంగా ఉంది. మరి సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. 

పవన్‌ నుంచి చాలా గ్యాప్‌తో వస్తోన్న మూవీ కావడం, ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక విడుదలవుతున్న మొదటి మూవీ కావడంతో దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దాన్ని ఈ మేరకు సినిమా రీచ్‌ అవుతుందనేది చూడాలి.