కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ మరణించారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. పోలో ఆడుతుండగా ఆయన కుప్పకూలిపోయారని తెలుస్తోంది.
ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. హీరోయిన్ కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ కన్నుమూశారు.సంజయ్ ప్రముఖ వ్యాపారవేత్త, పోలో ప్లేయర్. ఆయన వయసు 53 సంవత్సరాలు. జూన్ 12న సంజయ్ గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. సంజయ్ యూకేలో పోలో ఆడుతుండగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా, ప్రాణాలు దక్కలేదని తెలుస్తోంది. ఈ విషయంలో కుటుంబ సభ్యులు ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, నటుడు, రచయిత సుహేల్ సేథ్ ఒక పోస్ట్ ద్వారా సంజయ్ మరణవార్తను ధృవీకరించారు. దాంతో సోషల్ మీడియాలో అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.
సంజయ్ కపూర్ చివరి పోస్ట్
గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంపై సంజయ్ కపూర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ చేశారు. ఇదే ఆయన చివరి పోస్ట్. అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడం బాధాకరం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ కష్టకాలంలో వారికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలి అని ట్విట్టర్‌లో రాశారు.
సంజయ్ కపూర్ గురించి
సంజయ్ కపూర్, కరిష్మా కపూర్ 2003లో వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారు సమైరా, కియాన్. కొన్నేళ్లకు వారి మధ్య విభేదాలు తలెత్తాయి. మనస్పర్థల కారణంగా ఈ జంట 2016లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి కరిష్మా పిల్లలను ఒంటరిగా పెంచుతున్నారు. తల్లి దగ్గర ఉన్నా కాని పిల్లలు అప్పుడప్పుడు తండ్రిని కలుసుకునేవారు. విడాకుల తర్వాత సంజయ్ జీవితంలోకి ప్రియా సచ్‌దేవ్ వచ్చారు. న్యూయార్క్‌లో వారిద్దరికీ పరిచయం ఏర్పడింది, అది కాస్త ప్రేమగా మారింది. ఐదేళ్లు ప్రేమించుకున్న వీరు ఢిల్లీలో వివాహం చేసుకున్నారు. వారికి అజారియస్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే సంజయ్ మరణంపై కరిష్మా, ప్రియ ఇద్దరి నుంచి కూడా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
