ది ఇండియా హౌస్ సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదంపై స్పందించాడు హీరో నిఖిల్. ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్న యంగ్ హీరో.. ప్రమాదం వల్ల టీమ్ కు జరిగిన నష్టం గురించి క్లారిటీ ఇచ్చాడు.

యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటిస్తున్న సినిమా ది ఇండియా హౌస్. సినిమా షూటింగ్ లో అపశ్రుతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. శంషాబాద్ సమీపంలో వేసిన భారీ సెట్లో ఈ ప్రమాదం నిన్న రాత్రి జరిగింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ తీవ్రమైన గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మూవీ టీమ్ అంతా అంతా సురక్షితంగా బయటపడినట్టు హీరో నిఖిల్ స్వయంగా తెలిపారు.

ప్రమాదంపై స్పందించిన నిఖిల్

ప్రమాదం అనంతరం నిఖిల్ స్పందిస్తూ, ఆడియన్స్ కు గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు కొన్ని సార్లు రిస్క్‌లు తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగింది. కానీ మా టీమ్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. కాని ఈ ప్రమాదంలో ఖరీదైన పరికరాలు కొన్నిపాడైపోయి ఆర్ధిక నష్టం జరిగింది. అయినా దేవుడి దయవల్ల ప్రాణనష్టం ఏమీ జరగలేదు, అని తెలిపారు.

ది ఇండియా హౌస్ మూవీ సెట్ లో ప్రమాదం

ఇక ఈ ప్రమాదానికి సబంధించిన వివరాల్లోకి వెళితే, ది ఇండియా హౌస్ సినిమా షూటింగ్ కోసం శంషాబాద్ సమీపంలో భారీ ఎత్తున సెట్ ను ఏర్పాటు చేశారు. ఈ భారీ సెట్‌లో, సముద్రపు సన్నివేశాల చిత్రీకరణ కోసం వేసిన వాటర్ ట్యాంక్ ఓవర్ లోడ్ కారణంగా అకస్మాత్తుగా పగిలిపోయింది. ఈ ఘటనలో ట్యాంకులో ఉన్న నీరు పెద్ద ఎత్తున ఒక్కసారిగా సెట్లోకి ప్రవహించింది. దీంతో కొన్ని విలువైన కెమెరాలు, లైటింగ్ పరికరాలు నీటితో తడిసి దెబ్బతిన్నాయి. సాంకేతిక సిబ్బందిలో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. వారికి వెంటనే ప్రాథమిక చికిత్స అందించారు.

ది ఇండియా హౌస్ మూవీ షూటింగ్ ఎప్పుడు?

ఇక ఈసినిమాలో నిఖిల్ సరసన బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. 1905 కాలాన్ని ఆధారంగా చేసుకుని, ప్రేమ, విప్లవం వంటి అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ ప్రమాదం కారణంగా చిత్రీకరణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయినప్పటికీ, త్వరలోనే షూటింగ్ పునఃప్రారంభానికి చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది.

చిత్ర యూనిట్ తీసుకున్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, భారీ ఆర్థిక నష్టం జరగడం చిత్ర నిర్మాతలకు కాస్త ఆందోళన లోఉన్నట్టు సమాచారం. అయినప్పటికీ, త్వరలోనే ఈమూవీ షూటింగ్ ను రీ ఓపెన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.