క్లాసిక్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల మొదటి సారి చేసిన కమర్షియల్ సినిమా కుబేర. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈసినిమాకు మంచి స్పందన వస్తోంది. ఈక్రమంలో ఈసినిమాను అభిమానులతో కలిసి చూశారు హీరో ధనుష్, డైరెక్టర్ శేఖర్ కమ్ముల.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన మల్టీ స్టారర్ సినిమా కుబేర. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమా ‘ప్రపంచవ్యాప్తంగా ఈరోజు( 20 జూన్) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ సీనియర్ నటుడు నాగార్జున అక్కినేని, పాపులర్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, విడుదలైన మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకుంటోంది.
సినిమా విడుదలకు ముందే అంచనాలు భారీగా పెరగడంతో, సినిమా హిట్ అయితే కలెక్షన్లు కూడా అదే రేంజ్ లో వస్తాయని నమ్మకంతో ఉన్నారు మూవీ టీమ్. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వ నైపుణ్యం, ధనుష్–నాగార్జునల వంటి నటీనటుల కలయిక సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉండడంతో, ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా సినిమాను ప్రశంసిస్తున్నారు. ‘‘చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసిన ఫీల్ వచ్చింది అని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో తమ స్పందన తెలియజేశారు.
విదేశాల్లో కూడా ‘కుబేర’ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా యూఎస్ ప్రీమియర్ షోలు, యూకే, ఆస్ట్రేలియా మార్కెట్‌ల్లోనూ సినిమా పాజిటివ్ టాక్‌తో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, చిత్ర యూనిట్ సభ్యులు పాజిటివ్ ఫీడ్‌బ్యాక్‌ను స్వయంగా చూడాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో ధనుష్ తో పాటు దర్శకుడు శేఖర్ కమ్ముల చెన్నైలోని ప్రముఖ థియేటర్‌ను సందర్శించారు. విడుదల రోజైన జూన్ 20న వారు అభిమానులతో కలిసి సినిమాను ప్రత్యక్షంగా చూశారు. థియేటర్‌కి వచ్చిన అభిమానులు ధనుష్‌ను చూసి ఉత్సాహంతో సందడి చేశారు. వారి స్పందనను చూడటానికి అక్కడికి వెళ్లిన మూవీ టీమ్.. ఫ్యాన్స్ ఆనందం చూసి దిల్ ఖుష్ అయ్యారు.
ఈ సందర్భంగా అక్కడ తీసిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానుల మధ్య కూర్చొని సినిమా చూసిన ధనుష్, శేఖర్ కమ్ముల గెస్ట్ లా కాకుండా ప్రేక్షకుల మాదిరిగానే కనిపించడం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఇది కుబేర టీమ్‌కి కూడా మానసికంగా పెద్ద బూస్ట్ ఇచ్చినట్టు అయ్యింది.
‘కుబేర’ సినిమా డిఫరెంట్ కథా నేపథ్యం తో తెరకెక్కింది. శేఖర్ కమ్ముల మార్క్ స్క్రీన్ ప్లేకు తోడు ధనుష్, నాగార్జునల అభినయంతో ప్రేక్షకులు ఉర్రూతలూగారు. అంతే కాదు రష్మిక మందన్న పాత్రకూ మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం సినిమా మీద నెలకొన్న పాజిటివ్ టాక్ దీనికి వసూళ్ల పరంగా కూడా బలాన్ని చేకూర్చే అవకాశం ఉంది.
సినిమా మొదటి రోజే స్టార్ హీరో ధనుష్ తో పాటు దర్శకుడు శేఖర్ కమ్ముల అభిమానుల మధ్యలో సినిమా వీక్షించటం, సినిమా మీద ఆడియన్స్ లో నమ్మకాన్ని పెంచింది. మరి ఈమూవీ లాంగ్ రన్ లో ఎంతటి విజయాన్ని సాధిస్తుంది, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావం చూపిస్తోందో చూడాలి. తమిళంలో ఈసినిమా 300 కోట్లు కలెక్ట్ చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.
