40 ఏళ్ల నటి కామ్య పంజాబీ పలు సీరియస్ లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. కామ్య హిందీ బిగ్ బాస్ 12 లో కూడా పాల్గొన్నారు. ఆ షో ద్వారా కామ్యకు మరింత ఎక్కువ గుర్తింపు లభించింది. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కామ్య మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలని వెల్లడించారు. 

కామ్య తన వైవాహిక బంధంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. కామ్య బంటి నేగి అనే వ్యాపారవేత్తని వివాహం చేసుకున్నారు. 2003లో వీరి వివాహం జరగగా పదేళ్ల తర్వాత 2013లో విడాకులు తీసుకుని విడిపోయారు. ఈ విషయం గురించి మాట్లాడుతూ.. నా వైవాహిక జీవితం చిన్నాభిన్నమైంది. ఆ సమయంలో గుండె పగిలేలా ఏడ్చా. జీవితంలో ప్రేమ, పెళ్లి జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నా. 

ఈ ఏడాది ఫిబ్రవరిలో నాకు ఆరోగ్య సమస్య తలెత్తింది. ఆ సమయంలో నా స్నేహితురాలు షలభ్‌ దాంగ్‌ అనే వైద్యుడిని సంప్రదించమని సలహా ఇచ్చింది. అప్పుడే నాకు షలభ్‌ దాంగ్‌ తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత తరచుగా చాటింగ్ చేసుకునేవాళ్లం. కొద్దిరోజుల తర్వాత షలభ్‌ నాకు ప్రపోజ్ చేశారు. అలా ఆయన ప్రేమలో పడ్డా. 

త్వరలో మా వివాహం జరగబోతోంది. ఈ సారి నన్ను పెళ్లైన మహిళగా చూస్తారు అని కామ్య నవ్వుతూ చెప్పింది. ఇకపై పెళ్లే వద్దు అనుకుంటున్నా నా ఆలోచనా విధానాన్ని షలభ్‌ మార్చారు అని కామ్య తెలిపింది.